ఉద్యోగం కోసం తండ్రిని ‘ఆత్మహత్య’ చేశారు.. బెల్లంపల్లిలో - MicTv.in - Telugu News
mictv telugu

ఉద్యోగం కోసం తండ్రిని ‘ఆత్మహత్య’ చేశారు.. బెల్లంపల్లిలో

September 21, 2020

Father 'committed incident' for a job .. in Bellampalli.

రోజురోజుకు సమాజం ఎటుపోతోంది? డబ్బు కోసం బంధుత్వాలను నిర్దాక్షిణ్యంగా తెంచుకుంటున్నారు. కని పెంచిన కన్నవారిని సైతం డబ్బు ముందు చంపేసేంత దారుణంగా తయారవుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటన రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఉద్యోగం కోసం తండ్రిని హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరించారు. అయితే నిజం ఎక్కువ రోజులు దాగలేదు. నిందితులను పట్టుకున్న పోలీసులు వారిని కటకటాల వెనకకు నెట్టారు. బెల్లంపల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన ముత్తె శంకర్.. 55 ఏళ్లుగా సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ముత్తె శంకర్ ఈ నెల 5న అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యులే తన అన్నను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎట్టకేలకు హత్య మిస్టరీని ఛేదించారు.

ముత్తె శంకర్‌కు భార్య విజయ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు శ్రావణ్ ఉన్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో అనేకసార్లు పంచాయితీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో రెండేళ్లుగా కుటుంబ సభ్యులకు శంకర్ దూరంగా మంచిర్యాలలోనే నివాసం ఉంటున్నాడు. అయితే తన కూతురు స్వాతికి కరోనా వచ్చిందని, ఆరోగ్యం బాగాలేదని కబురు రావడంతో చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మరోమారు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో అతని మీద గుర్రుగా ఉన్న కుటంబ సభ్యులు పథకం ప్రకారం నిద్రిస్తున్న శంకర్‌ను గొంతు నులిమి హత్య చేశారు. బెల్ట్‌తో మెడకు ఉరివేసి చీర గొంతుకు బిగిసేలా చేసి హత్య చేశారు. అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి చీరతో ఉరివేసుకున్నట్లు నమ్మించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులకు చీరతో ఉరివేసి చంపారని తేలిందని బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్ వెల్లడించారు. హత్యకు మరొక వ్యక్తి సహకరించారని ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని చెప్పారు. త్వరలోనే అతన్ని అరెస్ట్ చేస్తామని అన్నారు. హత్యకు ఉపయోగించిన బెల్ట్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.