సంగారెడ్డిలో ఘోరం.. లాక్‌డౌన్ కష్టాలు తోడై కూతురి గొంతు కోసి
సంగారెడ్డి జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. నాలుగేళ్ల కుమార్తెను కన్నతండ్రే హతమార్చాడు. లాక్‌డౌన్ వేళ జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పుల్కల్ మండలం గొంగులూరు తాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రమావత్ జీవన్ రోజువారి కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. లాక్‌డౌన్ కారణంగా అతనికి పని దొరకడంలేదు. దీంతో ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి.
దీనికి తోడు భార్యతో నిత్యం గొడవలు ముదురుతున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జీవన్ నిద్రిస్తున్న చిన్నారి అవంతిక (4)ను గొంతు కోసి హత్య చేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలే కుమార్తె ప్రాణాల మీదకు తెచ్చిందని స్థానికులు ఆరోపించారు. కాగా, కరోనా కట్టడి చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో రోజూ పని చేసుకుని బతికేవారి పరిస్థితులు ధీనంగా తయారయ్యాయి.