క్వారంటైన్‌లో కూతురు.. మృగాలు రాకుండా రాత్రిళ్లు తండ్రి కాపలా  - MicTv.in - Telugu News
mictv telugu

క్వారంటైన్‌లో కూతురు.. మృగాలు రాకుండా రాత్రిళ్లు తండ్రి కాపలా 

May 22, 2020

Father turns nightwatchman for lone woman quarantined in area with marauding tuskers

కరోనా క్వారంటైన్లలోని మహిళలపై అత్యాచారాలు సాగుతుండడం తెలిసిందే. పంజాబ్‌లో అయితే రిటైర్డ్ మహిళా ఎస్ఐపైనే సామూహిక అత్యాచారం జరిగింది. సురక్షితం కాని క్వారంటైన్లపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కామాంధుల నుంచే కాకుండా చివరకు అడవి మృగాల నుంచి కూడా రక్షణ కరువైంది. 

ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో ఓ క్వారంటైన్ సెంటర్లో ఉన్న కూతురి కోసం ఓ తండ్రి నైట్ వాచ్ మెన్‌లా మారాడు. చుట్టుపక్కల అటవీ ప్రాంతం ఉండడం, ఏనుగులు ఇటీవల నలుగురిని చంపడంతో అతడు ఈ సాహసానికి పూనుకున్నాడు. కుడెకెలాకి చెందిన సుధీర్ ఖల్కో కూతురు ఒడిశా నుంచి రావడంతో ఈ నెల 11 నుంచి ధరమ్‌జైగఢ్ హైస్కూల్ భవనంలో ఆమెను క్వారంటైన్‌ చేశారు. అక్కడ ఆమె తప్ప మరెవరూ లేరు. తోలుమందం అధికారులు సరైన సదుపాయాలు కూడా కల్పించడలేదు. దీంతో సుధీర్ రోజూ 8 కి.మీ నడిచి ఇంటికెళ్లి ఆహారం తెస్తున్నాడు. రాత్రిపూట సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో తనే గార్డుగా మారాడు. ‘నా బిడ్డను కాపాడుకోడానికి మరోదారి లేదు.. అధికారులకు అన్నీ తెలిసినా పట్టించుకోలేదు. చివరకు పట్టెడన్నం కూడా పెట్టడం లేదు..’ అని సుధీర్ వాపోయాడు. ఈ విషయం వార్తల్లోకి ఎక్కడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది.