mictv telugu

 నాన్న.. సగం భూమి- సగం ఆకాశం…… ఇది కథ కాకూడదు…

June 17, 2018

చిన్నప్పుడు మొదటిసారి నా వేలు పట్టుకుని నడిపించింది అమ్మో, నాన్నో సరిగ్గా గుర్తులేదు. అమ్మ ఇంటి పట్టునుండి పరిచయం చేసిన ప్రపంచం వేరు. నాన్న పరిచయం చేసిన బయటి ప్రపంచం వేరు.  నాన్న ఇల్లొదిలి ఎన్నిచోట్ల తిరిగేవాడో తెలీదు.. కానీ అమ్మ ఎదురుచూపులో ఎప్పుడు వస్తాడో తెలీని ఒక అస్పష్ట రూపంగా మిగిలిపోయేవాడు.. నేనడిగిన బొమ్మనో సైకిల్‌నో ఎప్పుడు కొనిస్తాడో తెలీదు.. కాని అమ్మపైన మాత్రం నిత్యం విరుచుకుపడే తుఫాను మల్లె ఉండేవాడు… అప్పుడు అమ్మ కన్నీటిలో ప్రపంచం మునిగిపోయేది. నాన్నకెందుకంత కోపం! నాన్న వెనక దాక్కున్న జ్ఞాపకాలు రెండు. వాత అంటే ఏమిటో తెలియతనంలో.. నేను అమ్మ వీపుపై వాత పెట్టినప్పుడు.. అమ్మతో తన్నులు తప్పించుకునేందుకు నాన్న వెనకకు పరిగెట్టడం. ఇంకోసారి.. బ్యాంకులో డబ్బుల సంచితో చలానా ఎలా నింపాలో తెలియక, బ్యాంకు క్లర్క్‌ను ఎం అడగాలో మొహమాటంతో ముడుచుకుపోతూ  నాన్నను కవచంగా మార్చుకున్నప్పుడు..

నాన్న నన్ను మెచ్చుకున్న సందర్భాలు  తక్కువే. పొలం కౌలు డబ్బులు లెక్కపెట్టమన్నప్పుడు కౌలు రైతు ముందు.. నన్నుపట్టుకుని.. ‘వీడికి లెక్క ఎంచడమంటే బాగా సోకు… వీడి బావ వీనికంటే పదేళ్ళు పెద్దోడు.. అయినా లెక్కలు సరిగా చెప్పలేడు.. పైగా వాడు ఇంజనీర్  కూడా..’ అని ఒకసారేమో పొగిడాడు. ఆ డబ్బులెంచే ఉద్యోగం ఉంటే అందులో చేరిపోదాం అనిపించింది.

నాన్న ముద్దు అసలే గుర్తులేదు. నాన్న ఎత్తుకుని షికారుకెళ్ళిన జ్ఞాపకం సరిగా లేదు. నాన్న సంపాదన ఎంతని ఎవరైనా అడిగితే ఇంతని చెప్పే తెలివిగానీ, అడిగే చనువుగాని లేదు. అమ్మనడిగితే.. ఏమోరా.. ఇంట్లోమటుకు రెండువేలు ఇస్తాడు అని మాత్రం చెప్పేది. నాన్నకి చెప్పలేనన్ని సమస్యలున్నట్టు, అందుకు ఎవరో ఎవరో కారణమైనట్టు అందరినీ కలిపి తిట్టేవాడు. చిన్నాన్నని తిట్టేటప్పుడు ఇంటి కప్పు ఎగిరిపోయేది.. కంతిరి నాకొడుకని, అదని, ఇదని గట్టిగా అరిచేవాడు. పొలం చేసుకుంటున్న చిన్నాన్న గుత్త ఇంతని, కౌలు ఇంతని లెక్కలు చెప్పేవాడు కాదు. కనీసం నాన్నకు ఉద్యోగం పోయినపుడయినా కౌలు ఇంతని  ఇవ్వలేదు. అడిగితే అంతా నష్టం అనే వాడు. నాన్న అంతెత్తున ఎగిరిపడినా. చిన్నాన్న మాత్రం మొహం కిందకు వేలాడేసుకునే తప్ప ఎదురుతిరిగి పల్లెత్తుమాట అనేవాడు కాదు. ‘భూమి చీలిపోయింది.. దున్నేవాడికే భూమి..’ అని సరదాకు నేనంటే నా మీద కూడా అంతెత్తు విరుచుకుపడటం జ్ఞాపకమే ఇంకా.. ‘నీకేం తీలీదు.. పిల్లనాయాలా.. అసలు భూమి ఎక్కడుందో తెలుసా నీకు. మీ చిన్నాయన ఇప్పటివరుకు ఎంత తిన్నాడో తెలుసా నీకు.. నీకెందుకురా పెద్దోళ్ల మాటు..’ అని తిట్టేవాడు.

నాన్నది మేనరికం పెళ్లి. తనను  చేసుకోవడం నాన్నకు ఇష్టం లేదని అమ్మ అప్పడప్పుడూ చెప్పేది. అప్పుడు.. నాన్న అమ్మ పుట్టింటి వాళ్ళను అమ్మమ్మను, అమ్మ తమ్ముడిని(మేనమామను) అమ్మ చెల్లెలిని(చిన్నమ్మను) కలిపి తిట్టేవాడు. పెళ్లి సరిగా చెయ్యలేదని, పెళ్ళికి వచ్చిన చదివిoపులతో సహా మొత్తంపెళ్లి ఖర్చులకే సరిపోయిందని విసుక్కునే వాడు. అమ్మవైపు వాళ్లనే కాదు, తనవైపు వాళ్లనూ వదిలేవాడుకాదు..పెదనాన్న పెళ్ళానికి బానిసని, మోసగాడని, పెద్దమనిషిలాగా పంచాయితీలు చేసేందుకు వాడికి అసలు అర్హత లేదని అనేవాడు. పెదనాన్న ముందుమాత్రం ఏమీ అనేవాడు కాదు. అయినా పెదనాన్న కూడా నాన్న అంటే భయపడినట్టు ఉండేవాడు. అయితే నాన్న ఉద్యోగం మాత్రం నిజాయితీగానే చేసేవాడు. ఆఫీస్ ప్యూన్ దగ్గరినుంచి ఫీల్డ్‌మెన్ వరకు అందరూ నాన్నను మెచ్చుకునేవాళ్లే.ఉద్యోగం పోయినపుడు ఊరొదిలి పోడానికి ఇష్టం లేకనో, ఆరోగ్యం బాలేదనో పంచుకుని తీసేసుకున్న పొలాన్ని కౌలుకిచ్చో, ప్లాట్లను అమ్మో, బాండ్లను, ఫిక్స్డ్ డిపాజిట్లను కరిగించో ఇల్లునెట్టుకొచ్చేవాడు. అమ్మకు చేతనైంది ఇంటిపని, వంట పని మాత్రమే.. పెళ్లికాక ముందు పొలంపనులు చేసేది.  

అమ్మ ముద్దులు జ్ఞాపకమే. అమ్మ పొట్టమీద పడుకోవడం నిన్న మొన్నటివరకు నిత్యకృత్యమే. నాన్న దగ్గరకు తీసుకున్న ముద్దాడిన జ్ఞాపకం లేదు. నాకు కడుపు నొప్పి ఆపరేషన్ జరిగినపుడు నాన్న కళ్ళవెంట నీళ్ళు తిరిగాయని అమ్మ చెప్పింది.  చచ్చి పోతానేమో అనిపించడం, యమకింకరులు కనిపించి.. అన్నా..అని గట్టిగా అరినట్లు గుర్తు.. అన్నంటే.. నాకంటే ముందుపుట్టి, పురిట్లోనే చనిపోయిన వాడు.. తర్వాత అక్కా, నేనూ. నెలరోజులు ఆస్పత్రిలోనే ఉన్నా. దినదిన గండం. ఒంటిమీద నుంచి ఒక్కో  పైపు తీసేందుకు కొన్నివారాలు పట్టింది. నా కోసం నాన్న ఇంటి నుండి అన్నం మోసుకొచ్చేవాడు. అయినా అమ్మ కోసమే నా ఎదురు చూపలు. నాన్న నన్ను దగ్గరకు తీసుకుని లెక్కలు చెప్పిన సందర్భం లీలగానే జ్ఞాపకం. ఇంజనీరింగ్ ఫ్రీ సీట్ వస్తుందో, రాదేమోననే బెంగతో ఇంకొచం బాగా సదివి సావొచ్చు కదా అని కసిరిన జ్ఞాపకం ఇంకా పచ్చిగానే ఉంది. స్కూలు బాగ్ చినిగిపోయినప్పుడో, బూట్లు పాడైపోయినప్పుడో కొత్తవి కొంటారని, అడగాలని అనిపించలేదు.పెన్సిళ్ళు పెన్నులు పెట్టుకునే బాక్స్ మాత్రం మoచిది కొనివ్వమని అడిగితే, ఇంటికొచ్చిన తర్వాత అలిగితే చాలాసేపటి తర్వాత చెంప చెళ్లుమనిపించడం బాగా గుర్తు. తర్వాత నాన్న నన్ను కొట్టింది లేదు. బాధపడ్డాడో ఏమో తెలీదు.

కాలేజీ రోజుల్లో నా కోసం ఓ అమ్మాయి ఇంటికొస్తే కసిరి పంపించినందుకు రెండురోజులు అలిగాను. రెండు వేలు తీసుకుని టూరుకని వెళ్ళడం, ఎక్కడ తిరగాలో, ఏంచెయ్యాలో తెలీక రెండురోజుల తర్వాత మళ్లీ ఇంటికొచ్చెయ్యడం అయ్యాక ఒకటి నాకు బాగా అర్థమైంది. నాన్నలాగానే నేను కూడా అసమర్థుడినే అని! అప్పటినుండి నాన్నని ఏదైనా అడగటం మనేశాను. నాన్న నాకు స్నేహితుడిగా ఉంటే బావుండనిగాని,  నాన్నతో ఏమైనా పంచుకుందామనిగాని నాకెందుకో అనిపించలేదు.

నాన్నలోకి నేను, నాలోకి నాన్న ఎప్పుడైనా తొంగిచుసుకోకుండా అడ్డుపడిన తెర ఏముండేది అసలు? నాన్న పరిపూర్ణ రూపాన్ని నేను తెలుసుకోలేక పోయానా?. నాన్న చిన్నప్పటి జ్ఞాపకం వాళ్ళ అక్క… అంటే మా అమ్మమ్మ చెప్పడం గుర్తే. ఐదో ఏటనో, ఆరో ఏటనో వాళ్ళ నాన్న పోవడం, తర్వాత సంవత్సరానికే అమ్మ పోవడం,  పోవడానికి ముందు మoచంలో ఉన్నప్పుడు వద్ద్నన్నా వెళ్లి అమ్మ దగ్గర ముడుక్కోవడం చేసేవాడట. అమ్మ పోయాక మొండివాడిగా మారిపోయాడని అమ్మమ్మ చెప్పేది. నానమ్మ పోతూపోతూ… ‘నాకు వీడిమీదే బెంగగా ఉంది.. ఎట్లా బతుకుతాడో వీడు నేను లేకుండా.. ’ అని చెప్పిందట. అయినా భర్త పోయిన తర్వాత ఆమె చావును మనసారా దగ్గరకు తీసుకుంది. అన్నంనీళ్ళు ముట్టకుండా పస్తులుండిమరీ కాటికి పరుగులు పెట్టింది. చిన్నోడి తలంపు ఉండిందో లేదో మరి. నాన్న అల్లరి మొండిగా మారిపోయింది. చివరకు అది కోపంగా స్థిరపడిపోయింది. ఐస్ పుల్లకు అంటుకున్న ఐస్ సరిగా లేదని, మొత్తం కరిగిపోయేంతవరకు ఏడ్చిఏడ్చి చివరకు పుల్ల పడేసి స్చూలుకు పరిగెత్తేవాడంట.. అమ్మలేనితనంలో ఏడ్చే ఏడ్పులు ఎందుకు కొరగానివై కఠినంగా మారిపోయాడేమో.. అన్నావదినల దగ్గర చదువు, నాన్న వారసత్వంగా వచ్చిన టీబీ, ఆస్తమా నాన్నను మరింత  నీరసానికి, నిరుత్సాహానికి గురిచేశాయేమో.. ఇక జీవితంల. పరుగు ఆపి,  నడక మొదలు పెట్టాడప్పుడు. అస్తమానం మురికి బట్టలతో స్నానం చెయ్యకుండా, ఎప్పుడూ పడుకుని ఉండేవాడని పెద్దమ్మ చెప్పేది.. తనకు అమ్మలేదు కదా.. అమ్మప్రేమ లేదని, వదిన దగ్గర అది దొరకదనీ తెలుసుకున్నాక.. అర్థం కాని  ఆవేశంలో రగిలిపోయి, ఏటికి ఎదురీదలేకపోయిన కామన్‌మాన్ మా నాన్న..!

నాన్న అంతులేని ఆవేశాన్ని అర్థం చేసుకోవడం అంటే.. ఆయన అందుకోలేకపోయిన ఆకాశాన్ని  అందుకోవడమే. నాన్న సగం భూమీ, సగం ఆకాశం….!

నాన్నను అర్థం చేసుకునే చిన్ని ప్రయత్నం..  ప్రేమతో..