ట్రంప్‌కు కోర్టు షాక్.. వీచాట్‌పై నిషేధానికి కోర్టు బ్రేక్   - MicTv.in - Telugu News
mictv telugu

 ట్రంప్‌కు కోర్టు షాక్.. వీచాట్‌పై నిషేధానికి కోర్టు బ్రేక్  

September 21, 2020

Federal Judge Blocks Trump Administration's U.S. WeChat Ban

జాతీయ భద్రతకు ప్రమాదకరమని పేర్కొంటూ.. చైనాకు చెందిన టిక్‌టాక్‌తో పాటు వీచాట్‌ను నిషేధిస్తున్నట్లు అగ్రరాజ్యం అమెరికా మొన్న ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న  ఆదివారం నుంచి రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్లు అమెరికా అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఇంతలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి షాక్ తగిలింది.  అమెరికాలో 19 మిలియన్ల క్రియాశీల వినియోగదారులు ఉన్న  వీచాట్ మేసేజింగ్ యాప్ డౌన్‌లోడ్‌పై విధించిన నిషేధం అమలుకు కాలిఫోర్నియా కోర్టు అడ్డుపడింది. ఈ నిషేధాన్ని ఆపాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. భావప్రకటనా స్వేచ్ఛపై ఆందోళన రేకెత్తించే విధంగా ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులు ఉన్నాయని స్పష్టంచేసింది. 

అయితే తాజా పరిణామంపై స్పందించేందుకు వీచాట్ నిరాకరించింది. మరోవైపు ఈ తీర్పు వీచాట్‌కు స్వల్పకాలిక ఉపశమనం అని రిచ్‌మండ్ విశ్వవిద్యాలయం న్యాయ ప్రొఫెసర్ కార్ల్ టోబియాస్ అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘దీనిపై ప్రభుత్వం అప్పీల్ చేసి మళ్లీ గెలిచినా.. గెలిస్తే, ఆ నిర్ణయాన్ని అప్పీల్ చేయవచ్చు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవకపోవచ్చనే నమ్మకంతోనే కేవలం వారు సమయాన్ని కోరుకుంటున్నారు’ అని పేర్కొన్నారు. కాగా, తాజా పరిణామంతో ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి రావాల్సిన నిషేధం అమలు కొద్ది గంటల ముందు కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆగిపోయింది. వీచాట్ యాప్ టెక్నాలజీ దిగ్గజం టెన్సెంట్ సంస్థ చైనాకు చెందింది. టిక్‌టాక్‌తో పోలిస్తే వీ చాట్ యాప్‌ను అమెరికన్లు బాగా వాడుతారు. అలాగే అమెరికాలో ఉండే చైనీయులు కూడా దీనితోనే ఎక్కువగా ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతుంటారు.