మస్తు ‘ఫిదా’ చేసిండే! - MicTv.in - Telugu News
mictv telugu

మస్తు ‘ఫిదా’ చేసిండే!

July 21, 2017

చిత్రం :  ఫిదా

ఉప శీర్షిక : లవ్ – హేట్ – లవ్ స్టోరీ

నిడివి : 145 నిముషాల 35 సెకన్లు

సమర్పణ :  శ్రీమతి అనిత

బేనర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

పాటలు : సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, వనమాలి, చైతన్య పల్లవి

సినిమాటోగ్రఫి : విజయ్ సి కుమార్

ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్

సంగీతం : శక్తి కాంత్

నిర్మాతలు :  శిరీష్, దిల్ రాజ్

కథ – కథనం – మాటలు  – దర్శకత్వం : శేఖర్ కమ్ముల

నటులు : వరుణ్ తేజ్, సాయి పల్లవి, రాజ చెంబోలు, సాయిచంద్, శరణ్య ప్రదీప్, గీతా భాస్కర్, హర్షవర్ధన్ రాణే, నాథన్ స్మేల్స్ తదితరులు

అమెరికా అబ్బాయి.. బాన్సువాడ అమ్మాయిల ప్రేమ కథగా కనిపించే ‘ఫిదా’ సినిమా ‘ప్రేమ కథ’ మాత్రమే కాదు. ఒక్కో మనిషికి వొక్కో ప్రపంచం వుంటుందని, నువ్వే నా ప్రపపంచం అన్నంత సులువువుగా వుండదని, ఇద్దరి రెండు ప్రపంచాలూ వొకే ప్రపంచం కావడం వెనుక మరొకరి ప్రపంచం రద్దు కావడం వుంటుందని, అదే అస్తిత్వమని, ఆ అస్తిత్వాన్ని గౌరవించడమే అసలైన ప్రేమని కొత్త నిర్వచనాన్ని ‘ఫిదా’ చిత్రం ద్వారా శేఖర్ కమ్ముల మన ముందుంచారు! ప్రేమ పేరుతో రద్దవుతున్న.. ముఖ్యంగా అమ్మాయిలకి.. తిరిగి వారి ప్రపంచాన్ని వారికి యివ్వడంలోనే అసలైన జీవిత భాగస్వామ్యం వుందని చెప్పకనే చెప్పిన మంచి సినిమా యిది!

పాత కథే. ఎప్పటిలానే అమెరికాలో మొదలై ఇండియాకు వస్తుంది. చివరకు అలవాటుగా ఎయిర్ పోర్ట్ దగ్గరనే ఆగకుండా ఊళ్ళోని యింటిదాక వచ్చి సుఖాంతమయ్యే కథకి కథనం మాత్రం ప్రాణం పోసింది. జవ జీవాలు తొడిగింది. దానికి తోడు కథానాయిక ‘భానుమతి’ వ్యక్తిత్వం సినిమాకు పరిపుష్టిని యిచ్చింది. శేఖర్ కమ్ముల నాకూతురు భానుమతిలా వుండాలని అనడంతో అందరం ఏకీభవిస్తాం. భార్యగా కంటే కూతురుగా వొక మెట్టు పైన వుంది కాబట్టి శేఖర్ కూతురు అన్నారు. భార్యో.. భాగస్వామో.. అనలేదు!

కథకొస్తే- అమెరికాలో వరుణ్ (వరుణ్ తేజ) తన అన్నయ్యతో తమ్ముడితో వుండి మెడిసిన్ చదువుతూ వుంటాడు. కేస్ట్ అభ్యంతరం లేని ప్రకటనకు ఆసక్తి చూపించి ఇండియా పెళ్లి చూపులకు వస్తాడు అన్నయ్య. తర్వాత వచ్చిన తమ్ముడు వరుణ్ కు కూడా ఆ సంబంధం నచ్చుతుంది. అంతకన్నా యెక్కువ పెళ్ళికూతురు చెల్లెలు భానుమతి (సాయి పల్లవి) నచ్చుతుంది. భానుమతికి కూడా వరుణ్ నచ్చుతాడు. అయితే అక్క వెళ్ళాక తండ్రిని చూసుకొనేది తనేనని, తను కొడుకునని, నాన్నా నీతోనే వుంటానని అంటుంది. కాని ఆమె వరుణ్ ని కోరుకుంటే అవి యేవీ జరగవని- తండ్రిని, మల్లన్న గుడిని, పొలాలను, యింటిని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అలాగే వొకానొక కారణంతో వరుణ్ మీద నమ్మకం కోల్పోయి ప్రేమను తిరస్కరిస్తుంది. ప్రేమ పుట్టకుండానే సచ్చిపోయిందని అనుకుంటుంది. ప్రతిగా వరుణ్ కూడా. చివరకు ఆ అమ్మాయి ప్రపంచం అమ్మాయికి దక్కిందా లేదా అన్నదే మిగతా చూడవలసిన కథ!

మంచి సినిమాలతో మొదలై వెనకబడ్డ శేఖర్ కమ్ముల మళ్ళీ మంచి సినిమా తీసాడు. సున్నితమైన విషయాలను పట్టుకున్నాడు. నడపడంలో ద్వితీయభాగంలో నేమ్మదించి చివరకు లక్ష్యం చేరాడు. ఇంకా బిగువుగా నడపివుంటే బావుండేది. మొహమాటం, దాచుకోలేనితనం వున్న భానుమతి ‘విని’ తను నమ్మకం కోల్పోవడం సరిగా లేదు. ఆమె వ్యక్తిత్వంలో మొహమ్మీద అడిగేయడమే వుంది. అలా అడిగితే కథ లేదు!? ఇలాంటి ప్రధాన లోపాన్ని పక్కన పెడితే భానుమతి వ్యక్తిత్వం రూపు కట్టించడంలో మంచి మార్కులు కొట్టేసారు.

అందరికన్నా మంచి మార్కులు కొట్టేసింది సాయి పల్లవి. తను చాలా అద్భుతంగా నటించింది. పాత్రలో లీనమైంది. సినిమాలో లీనం చేసింది. తెలంగాణ యాస బాసలు కలిసివచ్చాయి. వరుణ్ తేజ తన పాత్రని బానే మెప్పించాడు. ఆమాటకొస్తే తండ్రిగా సాయిచంద్ వరకూ అన్నిపాత్రాలూ సినిమాలో లీనం చేశాయి. లొకేషన్లూ కూడా. సంగీతం చక్కగా వుంది. ‘వచ్చిండే.. మెల్ల మెల్లగ వచ్చిండే.. మస్తు డిస్టబు చేసిండే’ పాట యిప్పటికే ఆకట్టుకుంది. కోరియోగ్రఫీ మిళితమై చుట్టేసింది. హేయ్ పిలగాడా’ పాత కూడా. తెలంగాణ యాసబాసలూ పాటలు సినిమాకు మరింత వన్నె తెచ్చాయి!

కుటుంబంతో సరదాగా చూడాల్సిన సినిమా ఫిదా!

రేటింగ్: 3/5

-జాసి