బ్యాంక్‌లోకి చొరబడిన దొంగ.. చుక్కలు చూపించిన మహిళా మేనేజర్ - MicTv.in - Telugu News
mictv telugu

బ్యాంక్‌లోకి చొరబడిన దొంగ.. చుక్కలు చూపించిన మహిళా మేనేజర్

October 19, 2022

female bank employee successfully thwarts robbery bid, video goes viral

బ్యాంకు దోపిడీకి వచ్చిన దుండగుడిని ధైర్యంగా ఎదుర్కొంది ఓ బ్యాంకు మేనేజర్. ఆమె పోరాటానికి జడిసి దుండగుడు పారిపోయిన ఘటన రాజస్థాన్, శ్రీ గంగా నగర్ పరిధిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. రాజస్థాన్‌ శ్రీగంగానగర్‌లోని రాజస్థాన్‌ మరుధర గ్రామీణ బ్యాంకులో శనివారం నాడు చోరీకి వచ్చాడు ఓ దొంగ. ముసుగు ధరించి బ్యాగు, కత్తితో చొరబడ్డ ఆ వ్యక్తిని చూడగానే కొందరు షాకయ్యారు. అక్కడ బ్యాంకు సిబ్బందిని కత్తితో బెదిరిస్తూ తన వెంట తెచ్చుకున్న బ్యాగులో, బ్యాంకులోని డబ్బు నింపాలి అని బెదిరించాడు. దీంతో గందరగోళం తలెత్తింది.

ఆ అరుపులు విన్న బ్యాంకు మేనేజర్ పూనమ్ గుప్తా తన గదిలోంచి బయటకు వచ్చింది. దుండుగుడిని బెదిరించి, అతడికి ఎదురు నిలబడింది. అక్కడే తన చేతికి దొరికిన టూల్‌తో అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఆ దుండగుడు కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా భయపడలేదు. ఆమెకు, అక్కడున్న మరికొందరు అండగా నిలబడ్డారు. కత్తి పట్టుకుని డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగిన దొంగను.. మేనేజర్‌ పూనమ్‌ గుప్తా అడ్డుకున్నది. కటింగ్‌ప్లైయర్‌ పట్టుకుని ఎదురుదాడికి దిగింది. దీంతో పరుగు అందుకున్న దొంగను ఇతర సిబ్బంది పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలన్నీ బ్యాంకు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. దొంగను ద్వాడా కాలనీకి చెందిన 29 ఏళ్ల లావిశ్‌గా పోలీసులు గుర్తించారు.

ఈ వీడియోను ఐఆర్‌ఎస్ అధికారి డాక్టర్ భగీరథ్ చౌదరి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు 20 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మహిళా మేనేజర్ చూపిన దైర్యానికి నెటిజన్లను ఫిదా అవుతున్నారు. నీ ధైర్యానికి మా సలాం అంటున్నారు.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.