Female SI beat her owm uncle in delhi
mictv telugu

అత్తమామలపై పిడిగుద్దులు.. పోలీస్ కోడలి దౌర్జన్యం.. వీడియో

September 6, 2022

కుటుంబంలో అత్తమామ – కోడలు మధ్య కలహాలు ఉండడం మామూలే. చాలా వరకు ఇలాంటి వ్యవహారాలు ఇంట్లోనో లేక పొరుగువారు సర్ది చెప్పినప్పుడు సమసిపోతాయి. కానీ, ఢిల్లీలో కోడలు అయిన మహిళా ఎస్సై మాత్రం తన అత్తమామలపై పిడిగుద్దులు కురిపించింది. తల్లితో కలిసి వారిని తీవ్రంగా దూషిస్తూ ఏకంగా వారి లెంపలు వాయించేసింది. వయసులో పెద్దవారని కూడా చూడకుండా అధికార దర్పాన్ని ప్రదర్శించింది. అయితే ఇదంతా మరో పోలీస్ ఆఫీసర్ సమక్షంలోనే జరగడం గమనార్హం. ఆయన ఎంత వారించే ప్రయత్నం చేసినా కోడలు రెచ్చిపోవడంతో ఆమెపై కేసులు నమోదు చేశారు. వివరాల్లోకెళితే.. డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న వివాహితకి, తన అత్తమామల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది. దీనిపై వారు కోర్టుకు కూడా వెళ్లారు. అంతలోనే లక్ష్మీ నగర్‌లో నివాసం ఉంటున్న అత్తమామల ఇంటికి కోడలు తన తల్లితో కలిసి వెళ్లింది. రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగగా, తల్లి, కూతురు ఇద్దరు కలిసి వృద్ధ దంపతులపై విరుచుకుపడ్డారు. కోడలయితే మామయ్యపై ఏకంగా చేయి చేసుకుంది. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో తమను రెండేళ్లుగా కోడలు వేధిస్తోందని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని జులుం చేస్తోందని పోలీస్ ఉన్నతాధికారులకు అత్తమామలు ఫిర్యాదు చేశారు. దాంతో వారు కోడలు పోలీసుపై 323, 427 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.