నేరగాడికి మహిళా ఎస్ఐ మస్కా... పెళ్లి చేసుకుంటానని  - MicTv.in - Telugu News
mictv telugu

నేరగాడికి మహిళా ఎస్ఐ మస్కా… పెళ్లి చేసుకుంటానని 

November 30, 2019

Female SI.

సాహసం, తెలివి ఆ మహిళా ఎస్సై సొంతం. ప్రాణాలకు తెగించి ఓ కరడుగట్టిన నేరస్తుడిని వలపన్ని పట్టుకుంది. దీని కోసం పెద్ద సాహసమే చేసింది. అందులో  కాస్త అటూ ఇటైనా ఆమె ప్రాణాలకే ప్రమాదం. అయినా తెగించింది. వరుస నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చత్రాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లా బిజౌరీ గ్రామానికి చెందిన బాలకిషన్ చౌబే హత్య కేసుతోపాటు 16 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు.  చక్కా నేరాలు చేసుకుపోతున్నాడు కానీ, పోలీసులకు చిక్కటం లేదు. పోలీసులకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అతని వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది.  వాడిని పట్టుకోవడం తమవల్ల కాదని నిర్ధారించుకున్నారు. చివరికి అతని ఆచూకీ చెప్పినవారికి రూ.10 వేల రివార్డు ఇస్తామని ప్రకటించారు. 

దాంతోపాటు పెళ్లి ఉచ్చు కూడా బిగించారు. బుందేల్‌ఖండ్‌లోని ఓ కార్మికురాలి పేరిట సిమ్ కార్డును నిందితుడికి పోలీసులే పంపించారు. బాలకిషన్ ట్రాప్‌లో పడ్డాడు.  పెళ్లి చేసుకునేందుకు మహిళ కోసం చూస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. ఇదే అతన్ని పట్టుకోవడానికి మంచి అవకాశంగా భావించింది మహిళా ఎస్ఐ.. కొత్త నాటకానికి పూనుకుంది. తొలుత అతనికి కాల్ చేసి రాంగ్ నంబరుకు ఫోన్ చేశానని చెప్పింది. అమ్మాయి గొంతు వినగానే బాలకిషన్ ట్రాప్‌లో పడ్డాడు. అతనే తిరిగి ఆమెకు ఫోన్ చేస్తూ మాటా మాటా కలిపాడు. అనంతరం వారంరోజుల పాటు నిందితుడితో ఫోన్‌లోనే మహిళా ఎస్ఐ మాటలు కలిపింది.  నిందితుడు పెళ్లి ప్రతిపాదన చేయగా సరేనంటూ అతన్ని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంది. ఆమె దృష్టిలో అది ఉత్తుత్తి పెళ్లి.. అతనికి మాత్రం అది సీరియస్ పెళ్లి. పెళ్లి చేసుకోవడానికి బిజౌరీ గ్రామంలోని దేవాలయానికి రమ్మని కోరింది. అంతే ఎగిరి గంతేస్తూ గుడికి వచ్చాడు. 

అప్పటికే అక్కడ మహిళా ఎస్ఐ తన తోటి పోలీసు సిబ్బందితో కలిసి మఫ్టీలో వచ్చింది. బాలకిషన్‌ను వలపన్ని అరెస్ట్ చేసింది. శుక్రవారం అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు జడ్జి నిందితుడైన బాలకిషన్‌ను జైలుకు పంపించారు. చిక్కడు దొరకడులా మారిన బాలకిషన్‌ను వలపన్ని పట్టుకున్న మహిళా ఎస్సైను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. సినీ ఫక్కీలో డేర్ చేసిన ఆమెకు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.