కరోనా వైరస్ వల్ల అందరూ నష్టపోయారు కానీ, ఆన్లైన్ షాపింగ్ సంస్థలు మాత్రం అంతగా నష్టపోలేవనే చెప్పాలి. వైరస్ భయం వల్ల అందరూ ఇళ్లలోనే ఉండి తమకు కావాల్సిన వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ చేసి సేఫ్ సైడ్ గేమ్ ఆడారు. అంతకుముందు కూడా ఆన్లైన్ షాపింగ్ ప్రియులు ఉన్నా లాక్డౌన్ సమయలో ఆ సంఖ్య రెట్టింపు అయింది. దీంతో ఆన్లైన్ షాపింగ్ సంస్థలకు గిరాకీ బాగా పెరగింది. పైగా నిత్యావసరాలను కూడా చాలామంది ఆన్లైన్లోనే తెప్పించుకున్నారు. ప్రజల్లో కరోనా భయం.. అదే ఈ-కామర్స్ వ్యాపారానికి బాగా కలిసివచ్చింది.
ఈ క్రమంలో ఫ్లిప్కార్ట్ తన వ్యాపారులపై కనకవర్షం కురిపించింది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఉత్పత్తులు విక్రయించిన 70కి పైగా వ్యాపారులు ఏకంగా కోట్లు ఆర్జించారు. మరో 10 వేల మంది లక్షలకు పడగలెత్తారు. జాతీయ మీడియాలో వచ్చిన ఈ కథనాన్ని తాజాగా ఫ్లిప్కార్ట్ ద్రువీకరించింది. ప్రస్తుతం తమ వద్ద 3 లక్షలకు పైగా వ్యాపారులు రిజిస్టర్ చేసుకున్నారని వెల్లడించింది. తమ వద్ద రిజిస్టర్ అయిన వ్యాపారుల సంఖ్య ఈ ఏడాది 20 శాతం మేర పెరిగిందని కూడా తెలిపింది. వారిలో 60 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాలకు చెందిన వారేనని తెలిపింది. కాగా, ఫ్లిప్కార్ట్ వేదికగా జరిగిన హోల్సేల్ వ్యాపారంలో 50 శాతానికి పైగా ఆర్డర్లు టైర్-2, టైర్-3 సిటీల నుంచే వచ్చాయని తెలుస్తోంది.