ప్రాణాలే ముఖ్యం, థియేటర్లకు వెళ్లం.. సర్వేలో తేల్చి చెప్పేశారు..  - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాణాలే ముఖ్యం, థియేటర్లకు వెళ్లం.. సర్వేలో తేల్చి చెప్పేశారు.. 

October 26, 2020

Few people plan on going out to movie theatres in the next 60 days

ఏడు నెలల కరోనా లాక్‌డౌన్ కష్టాల నుంచి ప్రపంచం క్రమంగా బయటపడుతోంది. అన్‌లాక్ ప్రక్రియ కూడా పూర్తవుతోంది. ఆలయాలు, ఆఫీసులు, బార్లు, క్లబ్బులు.. అన్ని బహిరంగ స్థలాలు బార్లా తెరుచుకున్నాయి. అక్టోబర్ 15 నుంచి కొన్ని చోట్ల సినిమా థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. అయితే 50 శాతం సీట్లను ఖాళీగా ఉంచాలని ప్రభుత్వం చెప్పడంతో గిట్టుబాటు కాదని చాలా రాష్ట్రాల్లో సినిమా హాళ్లను ఇంకా తెరవలేదు. ఒకవేళ తెరిచినా భారీగా నష్టపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. 

బతికుంటే బలుసాకు తినొచ్చని సామాన్యులు భావిస్తుండడమే దీనికి కారణం. తాము ఇప్పట్లో సినిమా హాళ్లకు వెళ్లే ప్రసక్తే లేదని మన దేశంలోని మెజారిటీ ప్రజలు తేల్చిచెప్పారు. ప్రతి నలుగురిలో ముగ్గురు తాము కరోనా తగ్గేంతవరకు హాళ్ల ముఖం చూడమన్నారు. వచ్చే 60 రోజుల్లో తాము సినిమా హాళ్లకు వెళ్లమని ఏకంగా 93 శాతం మంది స్పష్టం చేశారు.  

లోకల్ సర్కిల్స్ అనే సంస్థ చేసిన సర్వే ప్రకారం.. వచ్చే రెండు నెలల వరకు సినిమా హాళ్లకు వెళ్లబోమని మెజారిటీ ప్రజలు చెప్పారు. హాళ్లకు వెళ్తే కరోనా సోకుంతుందన్న భయమే దీనికి కారణం. అయితే సినిమాలంటే పడిచచ్చే వాళ్లు తాము చచ్చిపోయినా ఫర్వాలేదని, కొత్త సినిమాలు చూసి తీరతామని కుండబద్దలు కొట్టారు. హాళ్లకు వెళ్లి కొత్త సినిమాలు చూస్తామని 4 శాతం మంది చెప్పగా, పాతవైనా కొత్తవైనా సరే సినిమా హాళ్లకు వెళ్తామని అన్నారు. 

సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 8,274 మందిని ప్రశ్నించారు. తాము హాళ్లకు వెళ్లమని 74 శాతం మంది చెప్పారు. తాము  సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వెళ్లడం లేదని, ఫోన్లలో, టీవీల్లో చూస్తుంటామని 17 శాతం అన్నారు. వెళ్తామో, లేదో తమకే తెలియదంటూ  2 శాతం మంది సమాధానం దాటవేశారు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్నవాళ్లు ఓటీటీలో మూవీలు చూస్తున్నామని చెప్పారు. అయితే థియేటర్లో చూసినంత తృప్తి కలగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో థియేటర్లు, మల్లీపెక్సులు తెరుచుకున్నాయి. తెలంగాణ, ఏపీలో థియేటర్లను తెరవడానికి యజమానులు సాహసించడం లేదు. తాము నష్టపోకుండా ప్రభుత్వం పన్నురాయితీలు ఇవ్వాలని కోరుతున్నారు.