తెలంగాణాకు ‘ ఫిదా ’... శేఖర్ కమ్ముల ! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణాకు ‘ ఫిదా ’… శేఖర్ కమ్ముల !

July 20, 2017

దర్శకుడు శేఖర్ కమ్ములకు తెలంగాణ ప్రాంతంలోని లొకేషన్స్ చాలా బాగా నచ్చాయని అంటున్నాడు. ఇన్ని రోజులు తెలుగు సినిమాల్లో పల్లెటూర్లంటే కోనసీమ, పశ్చిమ గోదావరి, రాజమండ్రి, భీమవరం వంటి ప్రాంతాలనే ఎక్కువగా చూపించారు. కారణం ఇండస్ట్రీలో ఎక్కువగా ఆ ప్రాంతం వాళ్ళే వుండటం. అందువల్ల తెలంగాణ ప్రాంతంలోని మంచి మంచి లొకేషన్లు, వూళ్ళ పేర్లు అస్సులు తెలుగు తెర మీద కన్పించలేవు, విన్పించలేక పోయాయి ?

ఇక తెలుగు సినిమా అంటే ఇదే సంస్కృతి, ఇదే సంప్రదాయం, మనుషులవి ఇవే అస్థిత్వాలు…, అన్నంతగా ఇక్కడి సినిమాలు మన మీద ప్రభావం చూపాయి. తెలంగాణా ప్రాంత ప్రజల వైఖరి, జీవన శైలి, సోకాల్డ్ తెలుగు సినిమాల్లో చూపించినట్టుగా అస్సలు వుండదు. చాలా భిన్నమైన వ్యవహారం ఇక్కడిది. తెలంగాణ వాళ్ళు కూడా చాలా రోజులుగా తెర మీద తమ సంస్కృతిని, సంప్రదాయాలను, లొకేషన్లను చూస్కోవాలని తపన పడ్డారు. అవి నెరవేరే రోజులు వచ్చేసాయి.ఒక మహా ఉద్యమం అనంతరం ఇప్పుడు తెలంగాణ వాళ్ళ జీవనాలు చలన చిత్రాల్లోకి ఒలుకుతున్నాయి. ఇది చాలా శుభ పరిణామం. పెళ్ళి చూపులు, అప్పట్లో ఒకడుండేవాడు వంటి సినిమాలు తెలంగాణ ఫ్లేవర్ తో వచ్చి జనరంజకంగా ప్రదర్శించబడ్డాయి. ఇప్పుడు ‘ ఫిదా ’ అంటూ డైరెక్టర్ శేఖర్ కమ్ముల పూర్తి నిడివి తెలంగాణ నేపథ్యపు సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా అమెరికా – తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది.

మళయాలం ‘ ప్రేమమ్ ’ సినిమా ఫేమ్ సాయిపల్లవి ఇందులో కథా నాయికగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా చేసాడు. మ్యాగ్జిమమ్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన టెక్నీషియన్లే దీనికి పని చేసారు. జూలై 21 న ఈ సినిమా రిలీజవుతోంది. అయితే ఈ సినిమా సాంతం నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో చిత్రీకరించారు. ఇందులో హీరోయిన్ మాట్లాడే తెలంగాణ మాటలు ఆకట్టుకుంటాయి. హీరోయిన్ కు అక్కగా యాంకర్ శరణ్యా ప్రదీప్ నటించింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం, దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఫిదా మీద ఇప్పటికే చాలా అంచనాలున్నాయి. చూడాలి ప్రేక్షకులు ఫిదాను చూసి ఏమాత్రం ఫిదా అవుతారో !?