" ఫిదా " ఆంధ్రా పెదాలకు తెలంగాణ భాష ... గుర్రం సీతారాములు ! - MicTv.in - Telugu News
mictv telugu

" ఫిదా " ఆంధ్రా పెదాలకు తెలంగాణ భాష … గుర్రం సీతారాములు !

July 26, 2017

‘ ఫిదా ’ ఆంధ్ర పెదాలకి తెలంగాణ బాష అతికిచ్చారు. ఫిదా సినిమాతో తెలంగాణలో అమాయక జనం మస్తు ఫిదా అయ్యారు. ఈ సినిమా కోసం నేనూ ఎదురు చూసాను. ఎందుకంటె ఇందులో కథ సహా రచయిత్రి నాకు మంచి మిత్రురాలు.ఇక హిరోయిన్ భానుమతి తండ్రి సాయిచంద్ ఒక దశాబ్ద కాలంగా కనీసం వారానికి ఒక సారయినా మాట్లాడుకొనే దగ్గరితనం. నాకు బాగా తెలిసిన నిజామాబాద్ లో షూట్. సినిమా ఆదర్శ భావాలు కులాంతర మతాంతర విహాహం చేసుకున్న ఒక తల్లి లేని ఇద్దరు బిడ్డల కథ. ఒక బిడ్డకు అమెరికా సంబంధం, బావ తమ్ముడితో తో హీరొయిన్ వ్యామోహం. అక్క నెల తప్పడం,ఇంట్లో పనిలో సహాయంగా చెల్లి పోవడం. సాధారణంగా తల్లి దండ్రులు పోతారు అదేదో వాళ్ళ మీద ప్రేమతో కాదు పనులకు ఆసరాగానే ఎక్కువ మంది పోతారు. మన భానుమతి లాగానే పోయాక హీరో పట్ల మరింత మమకారం పెంచుకోవడం అభిజాత్యం. అక్క కనకుండానే చెల్లి ఊరికి రావడం, హీరో ఆమెను వెతుకుతూ ఇంటికి రావడం లగ్గం జేసుకోవడం ఇదీ కత. వాస్తవానికి ఇది హైబ్రిడ్ అమ్మాయి ప్రేమకథ కాగితపు పూలలా రంగుతప్ప వాసన లేని జీవితాలు. ఇందులో తెలంగాణకు నచ్చే అంశం భానుమతి మలయాళీ అయినా తెలంగాణ యాస నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం.

ఒక చలాకీ అమ్మాయి తెలంగాణాయాస(భాష)లోమాట్లాడడం. సినిమాలో నిర్మాత, హీరోయిన్ అక్క, DOP మినహా అంతా తెలంగాణేతరులె. వాళ్లకు ఈ బాషమీద ఏం మమకారం ఉంటాది. ఆంధ్రా పెదాలకి తెలంగాణ బాష అతికిచ్చినట్టు జీవం లేని కథనం. భానుమతి అక్క హీరో తో అది ‘పిచ్చిది’ అనే డైలాగు నాలుగు సార్లు అంటాది. అంతకు మించి మాటలే లేనట్టు. తెలంగాణ జీవ భాష జల జలా రాలుద్ది ఎంత పాయిరం ఉంటాది ఇక్కడి మనుషుల్లో. చిట్ట చివరకు ఒక విషాదం కెసిఆర్ సార్ కూడా ఫిదా అయ్యాడు. ఇంటికి పిలుస్తాడు. భానుమతి, దిల్రాజు, వరుణ్ తేజతో బువ్వ తింటాడు. అవసరం అయితే తెలంగాణా అంతా ఫిదాను ఫ్రీగా చూపిస్తా అంటాడు. ఆంధ్ర పార్టీల నాయకులు తెలంగాణా మంత్రులు అవగా లేనిది ఈ హైబ్రిడ్ ఫిదా ఎంత? ఒక పక్క నగరం గంజాయి మత్తులో తూగుతోంది. ఆ మత్తుకు ఈ మత్తు తోడయింది. ఇప్పుడు ఒక కొత్త మార్కెట్ సూత్రం మొదలయింది. తెలంగాణా బాషకు మార్కెట్ ఉంది. అదో మత్తయిన అమ్మకపు సరుకు నియాన్ లైట్ వెలుతురులో ఒకప్పుడు విలన్ మాట్లాడిన యాస ఇప్పుడు అందమయిన అమ్మాయి మాట్లాడింది. తెలంగాణా శబ్దం ఉచ్చరించాకుండా ఇక ఫిదా అవ్వడం మీ వంతు.