ఫీల్డింగ్ అంటే ఇది..శభాష్ రాయుడు - MicTv.in - Telugu News
mictv telugu

ఫీల్డింగ్ అంటే ఇది..శభాష్ రాయుడు

April 13, 2022

 05

ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడిన విషయం తెలిసిందే. ముందుగా టాస్ ఓడిన చెన్నై.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. దూబే 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 (నాటౌట్) పరుగులు చేయగా, ఊతప్ప 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు.

 

అనంతరం 217 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు.. కెప్టెన్ డూప్లెసిస్ (8), విరాట్ కోహ్లీ (1), అనూజ్ రావత్ (12), మ్యాక్స్‌వెల్ (26) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఈ క్రమంలో షాబాద్ అహ్మద్, సుయాశ్ ప్రభుదేశాయ్ కాసేపు నిలదొక్కుకుని స్కోరు పెంచే ప్రయత్నం చేశారు. షాబాజ్ 27 బంతుల్లో 4 ఫోర్లతో 41, సుయాశ్ 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులు చేశారు. అయితే, వీరిద్దరినీ తీక్షణ పెవిలియన్‌కు పంపడంతో ఆర్సీబీ ఓటమి ఖాయమైంది.

అయితే, 36 ఏళ్ల వయసులో అంబటి రాయుడు చేసిన డైవింగ్ క్యాచ్‌ను చూసినవారంతా ‘శభాష్ రాయుడు నీకు ఎవరు సాటిరారు’ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ చేస్తుండగా, 16వ ఓవర్లో రవీంద్ర జడేజా బౌలింగ్ చేశాడు. ఆ బాలు వాస్తవానికి వికెట్ల ముందే ఆగిపోవాలి. కానీ, ఆకాశ్ దీప్ బ్యాటుతో బంతిని బౌండరీకి పంపే ప్రయత్నం చేశాడు. దీంతో బంతి గాలిలోకి లేచింది. నిజానికి బంతి వెళుతున్న దిశలో అంబటి రాయుడు లేడు. పక్కన కొద్ది దూరంలో ఉన్నాడు. ఒక్క ఉదుటున చేపపిల్లలా ముందుకు దూకేసి, కుడిచేతి వేళ్లతో ఆ బంతిని పట్టుకుని కిందపడిపోయాడు. అసాధ్యం లాంటి క్యాచ్‌ను రాయుడు సాధ్యం చేసి చూపించాడు. దీంతో ఈ సీజన్‌లో చెన్నై తొలి విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్‌పై 23 పరుగుల తేడాతో చక్కటి విజయాన్ని సొంతం చేసుకుంది.