Fifa foot ball fever in kerala fans going to must be crazy
mictv telugu

మ్యాచ్ చూడడానికి ఇంటినే కొన్నారు!

November 21, 2022

కొన్ని గంటలు ఓపికపడితే ఫిఫా మొదలవుతుంది. దానికి ముందే ఈ ఫీవర్ కేరళలో మొదలైంది. ప్రధాన పట్టణాల నుంచి చిన్నగ్రామాల్లోకి కూడా ఈ అభిమానం పాకింది.
ఖతర్ వేదికగా ఫుట్బాల్ ఆట మొదలవబోతున్నది. ప్రపంచం అంతా ఈ వరల్డ్ కప్ చూడడానికి ఎంతో ఎదురుచూస్తున్నారు. కేరళ కూడా తమ అభిమాన ఆటను చూడడానికి సర్వంగా సుందరంగా ముస్తాబయింది.

అభిమానులు ఒక్కో టీమ్ను గెలిపించాలని వారికి సపోర్ట్గా నిలుస్తారు. కేరళలో కూడా ఇప్పుడు ఫుట్బాల్ ఫీవర్ మొదలైంది. తమ అభిమాన ఆటగాళ్లకు, టీమ్కు మద్దతుగా నిలుస్తున్నారు. ఫిఫా ఫీవర్ ప్రపంచమంతా అంటుకున్నది. కేరళలోని మలపురం గ్రామంలో ఒక్కో ఇంటికి ఒక్కో దేశపు జెండా రంగులను వేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇలా వాళ్ల అభిమానాన్ని చాటారు. అంతేకాదు.. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కటౌట్లుకు అయితే కొదువ లేదు. పైగా ఆ కటౌట్లను ఏనుగుల మీద కూడా ఊరేగించేస్తున్నారు. కొందరు తమ ప్రత్యేక అభిమానాన్ని చాటుకోవడానికి పంప్లెట్లను కూడా పంచుతున్నారు.

మండకుమగల్ అనే గ్రామంలో అయితే 17మంది ఫుట్బాల్ ప్రేమికులు ఇంటిని కొన్నారు. అందరూ కలిసి మ్యాచ్లను చూడడానికి 23లక్షలను వెచ్చించారు. ఈ ఇంటికి బ్రెజిల్, అర్జెంటీనా, పోర్చుగల్ జెండాలను వేశారు. అంతేకాదు.. క్రిస్టియానో రానాల్డొ, లియోనియల్ మెస్సీని కూడా ఈ ఇంటి మీద రంగులు వేశారు. ‘ఈ ఇల్లు ఎప్పుడో అమ్మకానికి వచ్చింది. అయితే సాయంత్రం కాగానే ఇక్కడికి కొందరం ఫ్రెండ్స్ వచ్చేవాళ్లం. ఎవరి ఇంట్లో వారు కూర్చుంటే ఏం ఆనందం వస్తుంది. అందుకే అందరం కలిసి ఇంటిని కొన్నాం. మాలాగే ఇక్కడ ఉన్నవాళ్లంతా కలిసే ఉండాలి’ అంటున్నాడు షఫీర్ అనే వ్యక్తి. ఈ ఇంటిని మ్యాచ్ తర్వాత సోషల్ సర్వీస్, ఇతర అవసరాల కోసం వాడాలని ఈ గ్రామ ప్రజలు అనుకుంటున్నారు.