తల్లి అంత్యక్రియలు నిర్వహించే విషయంలో ఆమె కన్నబిడ్డలు గొడవ పడ్డారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం జరపాలని కూతురు, హిందూ ఆచారాల ప్రకారం నిర్వహించాలని కొడుకులు పట్టుబట్టడం వివాదానికి దారితీసింది. దీంతో పెద్ద గొడవే జరిగింది. చివరకు పోలీసుల జోక్యంతో అంత్యక్రియలు సజావుగా పూర్తయ్యాయి.
కూతురు ఇంటికెళ్లి
చాదర్ ఘాట్ ప్రాంతంలోని కమలానగర్ కు చెందిన రాములమ్మ జీహెచ్ఎంసీలో ఉద్యోగం చేసి రిటైర్ అయింది. ఆమెకు నలుగురు కొడుకులు కూతురు గుండమ్మ ఉన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న కూతురు ఇస్లాం మతం స్వీకరించింది. నఫీయా బేగంగా పేరు మార్చుకున్న ఆమె భర్తతో కలిసి మాదన్నపేటలో నివాసం ఉంటోంది. తల్లి రాములమ్మ కొడుకులతో కలిసి చాదర్ ఘాట్ లో ఉండేది. అయితే కొన్నాళ్ల క్రిత కూతురు ఇంటికి వెళ్లిన ఆమె అక్కడే ఉండిపోయింది. జనవరిలో రాములమ్మ సైతం మతం మార్చుకుంది.
అంత్యక్రియల విషయంలో గొడవ
80ఏండ్ల వయసు దాటిన రాములమ్మ అనారోగ్యంతో మంగళవారం చనిపోయింది. దీంతో రాములమ్మ కొడుకులు, బంధువులు మాదన్నపేటకు వచ్చారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. తన తల్లి మతం మార్చుకున్నందున ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఖననం చేయాలని కూతురు పట్టుబట్టింది. అందుకు నిరాకరించిన కొడుకులు హిందూ ఆచారాల ప్రకారమే నిర్వహిస్తామని పట్టుబట్టారు. దీంతో తల్లి అంత్యక్రియల విషయంలో కొడుకులు, కూతురు మధ్య పెద్ద గొడవే జరిగింది.
పోలీసుల పరిష్కారం
తల్లి అంత్యక్రియల విషయంలో బిడ్డలు గొడవ పడుతున్న విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కొడుకులు కూతురుకు నచ్చజెప్పి వారి మధ్య రాజీ కుదిర్చారు. తొలుత ఇస్లాం ఆచారాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించి అనంతరం రాములమ్మ మృతదేహాన్ని హిందూ స్మశాన వాటికకు తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు.