టీటీడీలో తోపులాట.. ముగ్గురికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

టీటీడీలో తోపులాట.. ముగ్గురికి గాయాలు

April 12, 2022

07

టీటీడీలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల విషయంలో భక్తుల మధ్య తోపులాట జరిగి, ముగ్గురు భక్తులకు గాయాలు అయిన సంఘటన చోటుచేసుకుంది. టీటీడీ రెండు రోజులుగా టోకెన్ల పంపిణీని నిలిపివేయడంతో మంగళవారం భక్తులు భారీగా ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగింది. అయితే, తిరుపతి భూదేవి, శ్రీనివాసం కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల వద్ద టోకెన్ల పంపిణీని మొదలుపెట్టడంతో భక్తులు మాకు అంటే మాకు టోకెన్లు ఇవ్వండి అంటూ ఒకరిపై ఒకరు ఎగబడ్డారు.

ఈ క్రమంలో ముందుగానే చాలా మంది భక్తులు ఆయా కేంద్రాలకు తమ పిల్లలతో తరలివచ్చారు. గోవిందరాజస్వామి సత్రం వద్ద భక్తుల తాకిడి మరింత ఎక్కువ కావడంతో.. టికెట్ల కోసం పోటీ ఏర్పడింది. దీంతో తోపులాట జరిగింది. కొద్దిమందే పోలీసులు ఉండడంతో, టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకున్నారు. అయినా, కట్టడి చేయలేకపోయారు. ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.

అయితే, టీటీడీ అధికారులు, సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. లైన్‌లో నిలబడిన వారికి సర్వదర్శనం టోకెన్లను కేటాయించకుండా బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించలేదని మండిపడ్డారు. ఘటన నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. కౌంటర్ల వద్ద జనం ఎగబడుతుండడంతో.. ఇవాళ్టికి ఎవరికీ టోకెన్లు అవసరం లేదని, టోకెన్లు లేకుండానే తిరుమల శ్రీవారిని దర్శించుకోవచ్చునని స్పష్టం చేసింది.