సోషల్ ఇష్యూల మీద స్పందించేవాడే అసలుసిసలైన హీరో. రోజురోజుకు మహిళల మీద దారుణాలు జరుగుతున్నాయి. అయినా చూసీ చూడనట్టు ఊరుకునేవారు చాలామంది ఉన్నారు. కానీ కొందరు మాత్రం హీరోల్లా స్పందిస్తారు. రౌడీల్లా ప్రవర్తిస్తున్నవారి తాట తీస్తారు. ఓ మహిళా బస్సు కండక్టర్పై దాడి చేసిన ఓ ఆకతాయికి మరో ప్యాసింజర్ గట్టిగా బుద్ధి చెప్పాడు. నాలుగు తన్ని ‘ముందు ఆడవాళ్లను గౌరవించడం నేర్చుకోరా బేవార్సు’ అని వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
రష్యాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒక బస్సులో ప్రయాణికుడ్ని మహిళా కండక్టర్ వచ్చి టికెట్ ఏదని ప్రశ్నించింది. దానికి అతను ఆమె ముక్కుపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె భయపడింది. అది చూసిన మరో ప్రయాణికుడు అస్సలు సహించలేకపోయాడు. ‘ఆడవాళ్ల మీద చేయి లేపుతావారా’ అనుకుంటూ వెళ్లి అతని మీద ప్రతి దాడి చేశాడు. పిడిగుద్దులు, తన్నలతో అతనికి దేహశుద్ధి చేశాడు. అయినా ఆ అగంతకుడు తాను చేసింది తప్పు.. అందుకే అతను తనను కొడుతున్నాడని అస్సలు గ్రహించకుండా ఉల్టా అతనిమీద కూడా తన ప్రతాపం చూపించాడు. కానీ సదరు హీరో మాత్రం అతని దుమ్ము దులిపాడు. ఆ తర్వాత ప్యాంటు జేబులో నుంచి పెప్పర్ స్ప్రేను తీసి ఆకతాయి కళ్లలో కొట్టాడు. దీంతో ఆకతాయి సీటుపై పడిపోయాడు. బస్సు దిగి వెళ్లిన అతను తన బ్యాగు కోసం మళ్లీ వచ్చి అతడ్ని కాలితో దవడ మీద బలంగా తన్నాడు. ఆ తన్నుకు అతను విలవిలలాడటం మనకు వీడియోలో కనిపిస్తుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆకతాయికి సరిగ్గా బుద్ధి చెప్పాడు అని అంటున్నారు.