File Your Income Tax Returns Before July 31 Deadline
mictv telugu

ఐటీఆర్ ఫైల్ చేయండి.. ఈ ప్రయోజనాలు పొందండి

July 12, 2022

ఆదాయపు పన్ను రిటర్న్స్‌ ( ఐటీఆర్‌) దాఖలు చేయడానికి చివరి తేదీ దగ్గర పడుతోంది. ఈ ఏడాది ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు జులై 31ని చివరి తేదీగా నిర్ణయించింది ప్రభుత్వం. కంపెనీలు, సంస్థల్లో పనిచేసే భాగస్వాముల వంటి పన్ను చెల్లింపుదారుల ఆదాయపు ఖాతాలను ఆడిట్‌ చేయాల్సి ఉంటుంది గనక వారికి అక్టోబరు 31 వరకు గడువు ఉంది. అయితే కొందరు.. మాకు వచ్చే ఆదాయమే అంతంత మాత్రం మేము రిటర్న్ ఫైల్ చేస్తే ఏంటి, చేయక పోతే ఏంటి అని నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఐటీ రిటర్న్ అనేది కేవలం ఉద్యోగులు, కోటీశ్వరులు, వ్యాపార వేత్తల వ్యవహారంగా చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతీ పౌరుడు బాధ్యతగా ఐటీ రిటర్న్ ఫైల్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి.

గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేస్తే పెనాల్టీ తప్పించుకోవడం మాత్రమే కాదు ఇతర బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా వరకూ బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థ ఐటీ రిటర్న్ లను లోన్ ఇచ్చేందుకు ప్రామాణికంగా భావిస్తాయి. ITR రసీదును అత్యంత విశ్వసనీయ ఆదాయ రుజువుగా పరిగణిస్తాయి. మీరు ITR ఫైల్ చేయడం ద్వారా, మీరు భవిష్యత్తులో కారు లోన్ లేదా హోమ్ లోన్‌ సహా మరే ఇతర రకాలైన లోన్స్ కోసం అప్లై చేసుకున్నట్లయితే మీకు కచ్చితంగా ITR చాలా సహాయం చేస్తుంది. మీరు సులభంగా లోన్ పొందవచ్చు. కొన్ని రకాల పెట్టుబడులపై నష్టాలు వాటిల్లితే వాటిని వచ్చే ఏడాది సమర్పించబోయే ఐటీఆర్‌ (ITR)లో చూపించేందుకు అవకాశం ఉంటుంది. ఫలితంగా పన్ను ప్రయోజనాలు పొంది కొంత ఆదా చేసుకోవచ్చు.

గడువులోగా ఐటీఆర్‌ ఫైల్ చేయనివారికి ఆదాయ పన్ను విభాగం రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మరోవైపు సెక్షన్‌ 234ఏ కింద చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా వసూలు చేస్తారు.