'Filling of those posts through this board': Sabita Indra Reddy
mictv telugu

‘ఈ బోర్డు ద్వారానే ఆ పోస్టుల భర్తీ’: సబితా ఇంద్రారెడ్డి

September 13, 2022

తెలంగాణ రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. 15 యూనివర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ‘తెలంగాణ స్టేట్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ ఏర్పాటు చేశామని, ఈ బోర్డు ద్వారానే యూనివర్సటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆమె పేర్కొన్నారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆమె కామన్ రిక్రూట్‌మెంట్ బిల్లును ప్రవేశపెట్టారు.

అనంతరం ఈ బిల్లు రాష్ట్రమంతటికీ వర్తిస్తుందని, వెంటనే అమల్లోకి వస్తుందని బిల్లులో పేర్కొన్నారు. యూజీసీ సహా ఇతర సంస్థలు జారీచేసిన మార్గదర్శకాల ప్రకారమే నియామకాలు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇక, ఈ ‘తెలంగాణ స్టేట్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ కిందకి వచ్చే విశ్వవిద్యాలయను పరిశీలిస్తే గనక… ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహత్మాగాంధీ, తెలంగాణ, తెలంగాణ మహిళా వర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌, పీవీ నర్సింహారావు వెటర్నరీ, కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్‌, ఆర్జీయూకేటీ, జేఎన్టీయూ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ యూనివర్సిటీలు ఉన్నాయి.

ఇక, ప్రభుత్వం ప్రకటించిన బోర్డుకు.. ఒక చైర్‌పర్సన్‌, నలుగురు సభ్యులు ఉంటారు. పదవిరీత్యా ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఉమ్మడి నియామక బోర్డుకు సైతం చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి చైర్మన్‌గా వ్యవహరిస్తుండగా, విద్యాశాఖ, జీడీఏ, ఆర్థికశాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉండగా, కళాశాల విద్య, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిట్టల్‌ మెంబర్‌ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు.