సిగరెట్ తాగుతున్న కాళికాదేవి… డైరెక్టర్‌పై కేసు
కాళికామాత సిగరెట్ తాగుతున్నట్టుగా రిలీజ్ అయిన ఓ సినిమా పోస్టర్ పై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులోని మధురైకి చెందిన లీనా మణిమేఖలై అనే డైరెక్టర్ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్‌లో కాళికామాత సిగరెట్ తాగడం, చేతిలో ఎల్జీబీటీలకు సంబంధించిన జెండాను పట్టుకోవడం… హిందూ దేవతను అత్యంత దారుణంగా కించపర్చారంటూ ఆయా సంఘాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో లీనా పై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.
హిందువుల మనోభావాలు గాయపర్చిన లీనాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. డైరెక్టర్ లీనాపై ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్ నమోదయ్యింది. గో మహాసభ కు నాయకత్వం వహిస్తున్న అజయ్ గౌతమ్ అనే వ్యక్తి చిత్ర నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తనపై సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలపై లీనా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. సమానహక్కుల కోసం ఈ డాక్యుమెంటరీని తీసినట్టు ఆమె తెలిపారు. కెనడా ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. వాక్‌స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్దంగా ఉన్నట్టు తెలిపారు.