ఏపీలో కొత్త జిల్లాలపై వారం రోజుల్లో తుది నోటిఫికేషన్! - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో కొత్త జిల్లాలపై వారం రోజుల్లో తుది నోటిఫికేషన్!

March 26, 2022

jagan

ఆంధ్రప్రదేశ్‌లో గతకొన్ని రోజులుగా కొత్త జిల్లాలకు సంబంధించి ధర్నాలు, రాస్తారోకలు, ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో జగన్ మోహన్ రెడ్డి ఈ కొత్త జిల్లాలకు సంబంధించిన తుది నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. అంటే.. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల పరిపాలన ప్రారంభం కానుంది. అయితే, ఈ పరిపాలనను జగన్ ఉగాది రోజునుంచి 13 కొత్త జిల్లాల్లో ప్రారంభించనున్నారు.

ఇప్పటికే ఈ కొత్త జిల్లాలపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. దీంతో మరో వారం రోజుల్లో తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇందుకోసం మార్చి 31న నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. దీని ప్రకారమే ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఉంటుందన్నది నిర్ధారణ కానుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలు, ప్రాంతాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల మార్పునకు సంబంధించి ప్రభుత్వానికి కొన్ని వందల అభ్యంతరాలు అందినట్టు తెలుస్తోంది.

అయితే, అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారిలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం తీవ్రస్థాయిలో కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే ఆయా జిల్లాల పరిధిపై స్పష్టమైన రూపు వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం జిల్లా పోలీసు శాఖలో విభజన, రెవెన్యూ ఉద్యోగుల విభజన ప్రక్రియ జరుగుతోంది. కాగా, కొత్త జిల్లాలకు సంబంధించి అధికారుల కార్యాలయాలను ప్రభుత్వం గుర్తించింది. ప్రాథమికంగా ప్రతి జిల్లాకు ఒక కలెక్టర్, ఒక జాయింట్ కలెక్టర్, ఒక ఎస్పీని నియమించనుంది.