స్టాక్ మార్కెట్లకు మంచి రోజులు వచ్చాయి మళ్ళీ. ఎనిమిది రోజుల తర్వాత మార్కెట్లు లాభాలను చూశాయి. బుధవారం సూచీలను పైపైకి పయనించాయి.
ఉదయం నుంచే మార్కెట్లు అంతా సానుకూలంగా ఉన్నాయి. ట్రేడింగ్ సాఫీగా మొదలైంది. చివర వరకు అదే కొనసాగింది కూడా. టీసీఎస్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లాంటి మెగా షేర్లు సూచీల లాభాలకు సహాయపడ్డాయి. ఎనిమిది రోజుల నుంచీ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు ఉండడంతో మదుపర్లు కొనుగోళ్ళకు మొగ్గు చూపారు. దీనికి అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలత కూడా కలిసి వచ్చింది. చైనా ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడం ఆసియా మార్కెట్లలో ని సానుకూలత నింపింది.
ఈరోజు సెన్సెక్స్ 59,136.48 దగ్గర లాభాలతో ప్రారంభం అయింది. ఇంట్రాడేలో 59,475.45 దగ్గర గరిష్టానికి చేరింది. చివరకు 448.96 పాయింట్ల లాభంతో 59,411.08 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 17,360.10 దగ్గర ప్రారంభమై 17,467.7517345.25 మధ్య ట్రేడయ్యింది. చివరకు 146.95 పాయింట్లు లాభపడి 17,450.90 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్ తో రూపాయి మారకం విలువ 82.50 దగ్గర ఉంది.
సెన్సెక్స్ సూచీలో పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మాత్రమే నష్టపోయాయి. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతీ, టాటా స్టీల్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, కొటాక్ మహీంద్రా, విప్రో షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి.