తెలంగాణలో ఈ మధ్య వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఈ క్రమంలో వైద్యారోగ్య శాఖలోనూ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మంగళవారమే మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా కొత్తగా ప్రారంభించిన పల్లె దవాఖానాల్లో పలు పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ ఆమోదం తెలిపింది.
మొత్తం 1492 మంది వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఆర్ధిక శాఖ జీవో నెంబర్ 1563 జారీ చేసింది. దీంతో వీరి నియామకానికి వైద్యారోగ్యశాఖ తగిన చర్యలు చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వైద్యం అందించే ఏఎన్ఎం సెంటర్లు 4745 ఉండగా, వీటిలో 3206 సబ్ సెంటర్లను పల్లె దవాఖానాలుగా మార్చాలని వైద్యారోగ్యశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలవగా, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు రోగులకు అవసరమైన మందులను అందిస్తున్నారు. వీరికి తోడుగా ఇప్పుడు వైద్యులను నియమిస్తుండడంతో మరింత నాణ్యమైన వైద్య సేవల గ్రామీణ ప్రాంతాల వారికి అందనున్నాయి. వీటిల్లో శాంపిల్స్ సేకరించి టీ డయాగ్నోస్టిక్స్ సెంటర్స్ కి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చే వ్యాధి నిర్ధారణ ఫలితాలన బట్టి అవసరమైన చికిత్సను అందిస్తారు. దీంతో వ్యాధి ముదరకుండా నివారించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రోగం ముదిరితే సీహెచ్సీ లేదా ఏరియా, జిల్లా ఆసుపత్రులకు సిఫారసు చేస్తారు. ఈ విధానం పూర్తిగా అమలైతే గ్రామీణులకు వైద్యం కోసం పట్టణాలకు వెళ్లే అవసరం తగ్గుతుంది.