Finance Minister disclosed the debts of AP and Telangana
mictv telugu

తెలుగు రాష్ట్రాల అప్పులు వెల్లడించిన కేంద్రం.. ఏపీకి షాక్

July 25, 2022

తెలుగు రాష్ట్రాలు సంక్షేమం పేరుతో అభివృద్ధిని పట్టించుకోకుండా భారీగా అప్పులు తెస్తున్నారని మేధావులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల అప్పులపై కేంద్రం లోక్‌సభలో సోమవారం వివరణ ఇచ్చింది. 2022 మార్చి వరకు తెలంగాణ రూ. 3 లక్షల కోట్ల 12 వేలు కాగా, ఏపీ అప్పులు రూ. 3 లక్షల 98 వేల కోట్లు ఉన్నాయని వెల్లడించింది. తెలంగాణలో 2014లో కేవలం రూ. 64 వేల కోట్లతో తలసరి అప్పు రూ. 18 వేలు ఉండగా, తాజా గణాంకాలతో అది లక్షకు పెరిగింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆర్ధిక మంత్రి నిర్మాలా సీతారామన్ ఈ మేరకు వివరాలు తెలిపారు. ఈ క్రమంలో ఏపీకి కేంద్రం షాకిచ్చింది. ప్రత్యేక కార్పొరేషన్‌ల ద్వారా తీసుకునే రుణాలను కూడా రాష్ట్ర అప్పులుగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. పన్నులు, సెస్‌లు తనఖా పెట్టి తెచ్చుకునే అప్పులు కూడా ఈ కోవలోకే వస్తాయని వివరించింది. కాగా, ఈ ఆర్ధిక సంవత్సరంలో తెలంగాణకు కూడా కేంద్రం ఇలాంటి నిబంధన విధించి అప్పుల్లో కోత పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఇన్ని అప్పులు చేసినా అభివద్ధి కనపడడం లేదని, చివరికి ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితికి దిగజార్చారని మండిపడ్డారు. అసెంబ్లీలో అనేకసార్లు ప్రస్తావించినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.