Finance Minister Nirmala Sitaraman angry on Kamareddy Collector
mictv telugu

రేషన్‌ షాపులో మోదీ ఫోటో ఎక్కడ?.. కలెక్టర్‌పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం

September 2, 2022

తెలంగాణలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కామారెడ్డి జిల్లా లో పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయన్న దానిపై ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీర్కూర్‌లో పర్యటించిన ఆమె ఓ ప్రభుత్వ రేషన్ దుకాణాన్ని పరిశీలించారు. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటో లేకపోవడంతో ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్‌పై నిర్మలా సీతారామన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా పేదలకు ఇచ్చే రేషన్ బియ్యంలో కేంద్రం వాటా, రాష్ట్ర వాటా ఎంత అని కలెక్టర్ ని ప్రశ్నించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. రేషన్‌ బియ్యంలో కేంద్ర వాటా ఎంతో మీకు తెలుసా? అని కలెక్టర్‌ని నిలదీయగా ఆయన తనకు తెలియదని సమాధానం చెప్పారు. IAS ఆఫీసర్ అయ్యి మీకు ఎలా తెలియదు అని ప్రశ్నించిన నిర్మలా సీతారామన్… అరగంట టైమ్ ఇస్తాను తెలుసుకొని చెప్పమని ఆదేశించారు. పేదలకిచ్చే రేషన్ బియ్యంపై కిలోకు 35 రూపాయల ఖర్చవుతుంటే కేంద్రం 29 రూపాయలు భరిస్తోందని.. ఈ విషయం జిల్లా కలెక్టర్‌ తెలియదని చెప్పడం బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు.

కరోనా సమయంలో కోట్లాది మంది పేద ప్రజలకు ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేసిన మోదీ.. ఫోటోను రేషన్ షాపులో పెట్టకపోవడం క్షమించరాని చర్యని నిర్మలా సీతారామన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రంలోగా మోదీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోతే తానే వచ్చి స్వయంగా కడతానని కలెక్టర్‌ని హెచ్చరించారు.