రేవంత్..10 కోట్లు.. బినామీలు..కేసుల చిట్టా - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్..10 కోట్లు.. బినామీలు..కేసుల చిట్టా

September 27, 2018

తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అతని బంధువుల ఇళ్లపై ఆదాయ పన్ను శాఖ దాడులు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయ కక్షతోనే దాడులు చేయించారని హస్తం పార్టీ ఆరోపిస్తుండగా, అంతా ఐటీనే చేసిందని, తమకేం సంబంధం లేదని టీఆర్ఎస్, బీజేపీలు అంటున్నాయి. ఇవి చాలా పాత కేసులని, వివరణ ఇచ్చుకోవాలని రేవంత్ రెడ్డిని  ఎన్నిసార్లు కోరినా స్పందించకపోవడంతో దాడులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రేవంత్ హైదరాబాద్‌లోని తనింటికి చేరుకోగా అధికారులు ఆయన నోటీసులు అందించారు.

tt

కేసుల వివరాలు ఇవీ..

దాడులకు సంబంధించిన కేసులన్నీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినవే. నల్లధనం, ఆదాయ పన్ను చట్టం, డబ్బు అక్రమ రవాణా(మనీ ల్యాండరింగ్), బినామీ లావాదేవీల చట్టం, అవినీతి నిరోధక చట్టం తదితర చట్టాల కింద వీటిని నమోదు చేశారు. రేవంత్ 2014 ఫిబ్రవరి 25 సింగపూర్లోని బహుళ అంతస్తుల భవనం అమ్మకంలో 20 లక్షల సింగపూర్ డాలర్లు పొందారని, అదే ఏడాదిలో మురళీ రఘువరణ్ అనే వ్యక్తి నుంచి రూ.60 లక్షలు పుచ్చుకున్నారని అభియోగాలు మోపారు. రేవంత్ తన ఎన్నికల అఫిడవిట్లో, ఐటీ రిటర్న్స్లో సరైన వివరాలు ఇవ్వకుండా దాచారని ఆరోపించారు. నకిలీ ఖాతాలతో  సింగపూర్, మలేసియాల్లో భారీ ఆస్తులు సమకూర్చుకున్నారని పేర్కొన్నారు. తన అనుచరులు, బినామీలు, బంధువుల పేర్లతో డొల్ల  కంపెనీలు సృష్టించి  కోట్లాది రూపాయల లబ్ధిపొందారని అభియోగాలు మోపారు. రేవంత్ తన సోదరుడు కొండల్ రెడ్డి ద్వారా హవాల రూపంలో దుబాయ్ నుంచి సొమ్ము పొందారన్నారు. ఇవన్నీ ఇటీవల చేసిన నేరాలు కావని, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచీ ఆయన కొండగల్లో ఆస్తులు కూడబెట్టారని తెలిపారు. రాజకీయ అండ, పలుకుబడితో ఆస్తులు కూడబెట్టారని వివరించారు. రేవంత్ విదేశాల్లోని ఆస్తుల విలువ రూ. 10కోట్లని, పేర్కొన్నారు. రేవంత్ తన సోదరుడు కొండల్ రెడ్డి ద్వారా హవాల రూపంలో దుబాయ్ నుంచి సొమ్ము పొందారన్నారు.