పెన్ను పోయింది వెతికిపెట్టండి.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు - MicTv.in - Telugu News
mictv telugu

పెన్ను పోయింది వెతికిపెట్టండి.. పోలీసులకు ఎంపీ ఫిర్యాదు

July 6, 2022

అధికారంలో ఉన్న ఓ ఎంపీ తన పెన్ను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదేంటి ఐదు, పది రూపాయలు ఉండే పెన్ను కోసం ఎంపీ ఫిర్యాదు ఎందుకు చేశాడు? అని అనుకోకండి ఆ పెన్ను విలువ దాదాపు లక్షా యాభైవేల రూపాయలు ఉంటుందట. ఆ పెన్ను ఆయన తండ్రి జ్ఞాపకార్థంగా ఇచ్చిన బహుమతి అట. మరి ఇంతకి ఆ ఎంపీ ఎవరు? ఏ రాష్ట్రానికి చెందిన వారు? అనే వివరాల్లోకి వెళ్తే..

తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి చెందిన కాంగ్రెస్ ఎంపీ విజయ్ వసంత్ తన తండ్రి బహుమతిగా ఇచ్చిన పెన్ను పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ పెన్ను విలువ అక్షరాలా లక్షా యాభైవేల రూపాయలు ఉంటుందని, తన తండ్రి జ్ఞాపకార్థంగా ఇచ్చిన ఆ పెన్నును కొన్ని ఏండ్లుగా భద్రంగా చూసుకుంటున్నానని, దయచేసి పోలీసులు ఆ పెన్నును వెతికిపెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఎంపీ విజయ్ వసంత్ తాజాగా విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హా ఎన్నికల్లో మద్దతు ఇచ్చేందుకు చెన్నైకి వచ్చారు. ఈ క్రమంలో గిండీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో స్వాగతం పలికిన సమయంలో ఆ పెన్నును ఎవరో దొంగిలించారు. దాంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతూ, ఫైవ్‌స్టార్ హోటల్‌లోకి వచ్చిన ప్రతివారిని అడిగి చూడగా పెన్ను దొరకలేదు. దాంతో ఆ పెన్నును ఎలాగైనా వెతకిపెట్టాలని కోరుతూ, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.