రోడ్డుపై కట్టెలు వేసినందుకు రూ.5 వేల ఫైన్
రోడ్డు మీద కట్టెలు వేసిన పాపానికి ఓ వ్యక్తికి ఎవరూ ఊహించని విధంగా కలెక్టర్ జరిమానా విధించారు. రూ.5 వేల ఫైన్ విధించడంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ ఘటన నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలం తిప్రాస్‌పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఆదివారం నారాయణపేట జిల్లాని కలెక్టర్ సందర్శించారు. గ్రామంలోని భరత్‌నగర్‌లో కొనసాగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. నల్లా పరిసరాలలో చెత్త పేరుకుపోవడంతో పంచాయతీ సెక్రటరీ జాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే గ్రామం స్వచ్ఛ పల్లెగా మారుతుందని అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రావు పార పట్టి అపరిశుభ్రంగా ఉన్న కాలువ నుంచి చెత్తను బయటకు తీశారు. అక్కడే రోడ్డుపై కట్టెలు వేయడం కలెక్టర్ చూశారు. దీంతో మరింత ఆగ్రహంగా ఆ కట్టెలు వేసిన దామరగిద్ద భగవంత్‌కు రూ.5 వేల జరిమానా విధించారు. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శికి కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 30 రోజుల పల్లెప్రగతి ప్రణాళిక అమలు పకడ్బందీగా చేపట్టడంలో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. ఇంటి పరిసరాలను, వీధులను, ఊరిని శుభ్రంగా వుంచే క్రమంలో ప్రతీ గ్రామస్థుడు పాటుపడాలని అన్నారు.