విమానం ఎక్కాలంటే వేలిముద్ర వేయాల్సిందే... - MicTv.in - Telugu News
mictv telugu

విమానం ఎక్కాలంటే వేలిముద్ర వేయాల్సిందే…

May 27, 2017

నలుగురిలో వేలిముద్ర వేయాలంటే నిరాక్షరాస్యులు మొహమాటపడేవారు. అదేదో నామోషీగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు చదువు వచ్చినోడు..చదువురానోడు అంటూ తేడాలేకుండా వేలిముద్ర వేయాల్సిందే. కాకపోతే వేలిముద్ర వేయడంలో కొంచెం తేడా అంతే. త్వరలో విమానం ఎక్కాలంటే కూడా వేలిముద్ర మస్ట్ కాబోతోంది.
విమానం ఎక్కేందుకు వేలిముద్ర, కనుపాప స్కానింగ్‌ వంటి బయోమెట్రిక్‌ విధానాలు పాటించే వీలుంది. అన్ని ప్రధాన విమానాశ్రయాల్లో 12-18 నెలల్లో బయోమెట్రిక్‌ పద్ధతిలో బోర్డింగ్‌కు అనుమతినిచ్చేలా సదుపాయాలు కల్పించాలని సర్కార్ యోచిస్తోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ల నుంచి విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన అధికారులు డిజిటల్‌ బోర్డింగ్‌ నమూనాను సునిశితంగా పరిశీలించడానికి బెంగళూరుకు వెళ్లారు. త్వరలోనే ఈ కమిటీ ఒక కన్సల్టెంటును నియమించి, ఈ ప్రక్రియను ఎప్పటిలోగా, ఎలా పూర్తిచేయాలో సలహాలు ఇవ్వాల్సిందిగా ఆదేశించనుంది. ఈ ప్రక్రియకు అవసరమైన మొత్తం సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ను ఈ కన్సల్టెంటు గుర్తించిన అనంతరం బయోమెట్రిక్‌కు ఏ భాగాన్ని (కళ్లు(ఐరిస్‌), వేలి ముద్రలు, స్మార్ట్‌కార్డ్‌..) వినియోగించాలన్నది నిర్ణయిస్తారు. ఇప్పటికే బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒక గేటు దగ్గర ఆధార్‌ ఆధారిత ప్రవేశం ఉంది. బయోమెట్రిక్‌ బోర్డింగ్‌ అమల్లోకి వస్తే.. మానవ వనరులు, ఎక్కువ సార్లు చెక్‌-ఇన్‌ పాయింట్లు తగ్గుతాయి. దీంతో తుది బోర్డింగ్‌ గేటుకు ప్రయాణికులు త్వరగావెళ్లే అవకాశం కలుగుతుంది.