పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. సుప్రీంలో పిటిషన్ - MicTv.in - Telugu News
mictv telugu

పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. సుప్రీంలో పిటిషన్

December 7, 2019

Disha Incident.

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘననపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు హర్షం, మరోవైపు వ్యతిరేకత వస్తోంది. నిందితులు తప్పు చేశారని నిర్ధారించాల్సింది న్యాయస్థానాలు.. వారికి శిక్షలు విధించాల్సిందీ న్యాయస్థానమే.. అంటూ ఏపీ మానవ హక్కుల ఫోరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రిమాండ్‌లో ఉన్న ఖైదీలను పోలీసులు ఎలా చంపేస్తారని ప్రశ్నించింది.

ఇదిలావుండగా ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.  2014లో ఎన్‌కౌంటర్ విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గ దర్శకాలను పోలీసులు తుంగలో తొక్కారని వారు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌‌పై శుక్రవారం షాద్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న  షాద్‌ నగర్‌ ఏసీపీ వి.సురేంద్ర ఫిర్యాదు చేయడంతో  హత్యాయత్నం (ఐపీసీ సెక్షన్‌ 307) కింద కేసు నమోదు చేశారు.

 గత నెల 28వ తేదీ తెల్లవారు జామున రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌, చటాన్‌పల్లి సర్వీస్‌ రోడ్డు వంతెన కింద పెట్రోల్‌ పోసి దిశను దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనలో నిందితులు లారీ డ్రైవర్లు మహ్మద్‌ ఆరిఫ్‌, చింతకుంట చెన్నకేశవులు, క్లీనర్లు జొల్లు శివ, జొల్లు నవీన్‌లు చర్లపల్లి కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు.   సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా శుక్రవారం ఉదయం దిశను దహనం చేసిన ప్రాంతంలోనే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.