కమెడియన్ భారతీ సింగ్ ఓ వివాదంలో చిక్కుకుంది. గడ్డం, మీసాలపై ఆమె చేసిన కామెంట్స్… ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి దారితీసింది. ఆమెపై ఐపీసీ సెక్షన్ 295-ఏ కింద కేసు నమోదైంది. ఓ కామెడీ షోలో భారతీ సింగ్ గడ్డం, మీసాలపై… గడ్డం, మీసాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, పాలు తాగే సమయంలో గడ్డం వెంట్రుకలు నోట్లోకి తీసుకుంటే సేమియా లాగా టేస్ట్ ఉంటుందని’’ అని కామెంట్ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీనిపై సిక్కు సమాజానికి చెందిన ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆమెను ట్రోల్ చేశారు.
ఈ విషయంపై అమృత్సర్లోని సిక్కు సంస్థలు భారతీ సింగ్కు వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. విషయం తీవ్రస్థాయికి చేరడంతో.. భారతి సోషల్ మీడియా వేదికగా.. చేతులెత్తి సిక్కు సమాజానికి క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వీడియోకి సంజాయిషీ ఇస్తూ.. తాను ఏ కులాన్ని, ఏ మతాన్ని కించపరచలేదని, ఏ పంజాబీని ఎగతాళి చేయలేదని తెలిపింది. సరదాగా తన ఫ్రెండ్ తో కామెడీ చేశానని, తప్పుగా అనిపిస్తే క్షమించాలని వేడుకుంది. అయినా.. భారతీ సింగ్ వ్యాఖ్యలపై సిక్కు కమ్యూనిటీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సిక్కు మతానికి చెందిన ఓ అధికార ప్రతినిధి తెలిపారు.