సికింద్రాబాద్‌లోని బోయిగూడలో ఉన్న టింబర్, స్క్రాప్ గోడౌన్లో బుధవారం తెల్లవారు జామున ఘోర అగ్రి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది బీహార్ వలస కార్మికలు మృతి చెందారు. మంటలు చెలరేగి పైకప్పు కూలిపోవడంతో అందులో నిద్రిస్తున్న వారు సజీవ దహనమయ్యారు. ఒకరు గోడదూకి బయటపడి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 8 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని భావిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా ప్రకటించారు. మృత దేహాలను వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. మరోవైపు ప్రధాని మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు.