చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఐసీయూలో ఒక్కసారిగా మంటలు చెలరేగగా, ఆస్పత్రి నిండా పొగలు కమ్ముకున్నాయి. రోగులు ఊపిరాడక అవస్థలు పడ్డారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి మూడు యంత్రాలతో మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 50 మంది రోగులు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. బయటకు తీసుకొచ్చిన వారిని వేరే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేస్తున్నారు. కాగా, ఎంత మంది మరణించారు అన్నది ఇంకా తెలియలేదు.