దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 27 మంది సజీవ దహనమయ్యారు. మూడంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో సీసీటీవీ కెమెరాల ఉత్పత్తి సంస్థ కార్యాలయంలో మొదట మంటలు చెలరేగగా, అనంతరం కొద్ది నిమిషాల్లోనే భవనమంతా మంటలు వ్యాపించాయని పోలీసులు తెలిపారు. ఘటన గురించి తెలిసిన వెంటనే స్పందించిన పోలీసులు సుమారు 40 మందిని కాపాడారు. ఇంకో ఫ్లోర్ గాలించాల్సి ఉండగా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. కాగా, ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. సీసీటీవీ కంపెనీ అధిపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు నష్టపరిహారం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు తమ సానుభూతిని వ్యక్తం చేశారు.