కరోనా ఆస్పత్రిలో అగ్నికీలలు.. ప్రాణభయంతో..  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా ఆస్పత్రిలో అగ్నికీలలు.. ప్రాణభయంతో.. 

September 21, 2020

Fire breaks out at Covid hospital in Odisha.

విజయవాడ స్వర్ణప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదంలో పదిమంది రోగులు మృతిచెందిన విషాధాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. కరోనా నుంచి కోలుకుని ఇంటికి తిరిగి వస్తారనుకున్న రోగులు అగ్నిప్రమాదంలో చనిపోవడం మృతుల కుటుంబాల్లో తీరని విషాధాన్ని నింపింది. తాజాగా అలాంటి మరో ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలోని ఓ కరోనా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఐసీయూలో ఈ ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది రోగులు అందరినీ హుటాహుటిన మరో ఆసుపత్రికి  తరలించారు. ఈ ప్రమాదం నుంచి 127 మంది కరోనా రోగులు తప్పించుకున్నారు.  

కటక్ జిల్లా జగత్‌పూర్‌లోని సద్గురు కరోనా ఆసుపత్రిలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడి సిబ్బంది, రోగులు భయంతో పరుగులు తీశారు. ఆసుపత్రి ప్రాంగణం అంతా అంబులెన్స్‌లతో నిండిపోయింది. వెంటవెంటనే రోగులు అందరినీ ఇరత ఆసుపత్రులకు తరలించారు. అధికారులు, పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియరాలేదని చెప్పారు. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. సదరు ఆసుపత్రికి ఫైర్ సేఫ్టీ చర్యలకు సంబంధించిన అనుమతులు లేవని.. కరోనా చికిత్సకు సంబంధించి ఈ ఆసుపత్రి నెల కిందటే కార్యకలాపాలు ప్రారంభించిందని తెలిపారు. కాగా, ఈ ఆసుపత్రి 150 పడకలతో సేవలు అందిస్తోంది. కటక్, భువనేశ్వర్‌లో ఆసుపత్రులు నిండిపోవడంతో రోగులు ఈ ఆసుపత్రికి వస్తున్నారు.