ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ రోగిని వైద్యం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించేందుకు ఆంబులెన్స్ ఎక్కిస్తుండగా హటాత్తుగా మంటలు చెలరేగాయి. ఆంబులెన్స్‌లోని గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున పంటలు ఎగసిపడ్డాయి. అంతే కాదు ఆంబులెన్స్ శకలాలు పక్కనే ఉన్న పొగాకు బేళ్లపై పడటంతో మరింతగా మంటలు చెలరేగాయి.
జిల్లాకు చెందిన పామూరు మండలం రాజాసాహెబ్ పేటకు చెందిన ఏసురాజు అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. డయాలసిస్ చేయించుకునేందకు తరచుగా ఆసుప్రతికి వెళ్తుంటాడు ఏసురాజు. సోమవారం ఏసురాజుకు డయాలసీస్ చేయించేందుకు కుటుంబ సభ్యులు 108 కు ఫోన్ చేసి ఆంబులెన్స్ ను పిలిపించారు. ఏసురాజుతో పాటు అతని తల్లి ఆంబులెన్స్‌లో కూర్చున్నారు. మార్గమధ్యలో హఠాత్తుగా డ్రైవర్ క్యాబిన్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ఆంబులెన్స్ డ్రైవర్ రోడ్డు పక్కన బండిని ఆపి ఏసురాజును అతని తల్లిని కిందకు దించాడు. ఆంబులెన్స్ నుంచి కొంత దూరం వెళ్లారు. ఈ మంటలు కాస్త సిలిండర్ వరకు వ్యాపించడంతో సిలిండర్ పేలింది. ఆంబులెన్స్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆంబులెన్స్‌తో పాటు పక్కనే ఉన్న పొగాకు మండెలపైన ఆంబులెన్స్ శకలాలు పడటంతో రూ. 40 లక్షలకు పైగా విలువైన పొగాకు మంటల్లో కాలిపోయింది. దీంతో రైతు తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఈ ప్రమాదంలో స్థానిక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.