Fire haircut goes horribly wrong, Gujarat teen suffers severe burns
mictv telugu

ఫైర్ హెయిర్ కట్.. తలకాలి.. ఆస్పత్రిపాలై..

October 27, 2022

నేటి కుర్రాళ్లకు జుట్టు పిచ్చి పీక్స్‌లో ఉంటుంది. ఎంత కోతపడితే, ఎంత కచ్చు పడితే, ఎంత రంగుపడితే, ఎంత కాలిపోతే అంత ఫ్యాషన్. పిచ్చిపిచ్చి రంగులు, నీలుక్కోవడం, వాలిపోవడం, గోక్కోవడం ఆ ఆనందమే వేరు. ఏం చేసైనా నలుగురి దృష్టిని, ముఖ్యంగా అమ్మాయిల దృష్టిని ఆకట్టుకోవడానికి కుర్రాళ్లు పడే కష్టాలు వర్ణానాతీతం. నానా హెయిర్ కటింగ్స్‌లో ఫైర్ హెయిర్ కట్‌పై వాళ్లకుండే మోజు గురించి చెప్పక్కర్లేదు. అయితే ఈ మోజు కాస్తా తలరాత బాలేకపోతే ఈ గుజరాత్ కుర్రాడి పట్టిన దుర్గతికి దారితీస్తుంది. ఫైర్ కటింగ్‌పై పిచ్చితో సెలూన్‌కు వెళ్లిన పిలగాడు వ్యవహారం బెడిసికొట్టడంతో ఆస్పత్రి పాలయ్యాడు.

వల్సాద్ జిల్లా వాపి పట్టణంలోని సెలూన్‌లో జరిగిందీ తంతు. క్షురకుడి ఓ కుర్రాడికి ఫైర్ హెయిర్ కట్ చేయడానికి తలకు బాగా కెమికల్ పూసి రెడీ అయ్యాడు. తర్వాత అగ్గి పెట్టేశాడు. అయితే కెమికల్ ఎక్కువగా పుయ్యడం, కంగారు అన్నీ కలగలసి కుర్రాడి తల భగ్గుమంది. తలపైనే కాకుండా మెడకూ మంటలు వ్యాపించాయి. బాధ తట్టుకోలేక మంటను దులుపుకున్నాడు. అప్పటికీ ఫలితం లేక కుర్చీలోంచి లేచి బయటికి పరిగెత్తాడు. తల వెంట్రుకలు చర్మం తీవ్రంగా కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.