నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఊపిరాకడ ఉక్కిరిబిక్కిరి - MicTv.in - Telugu News
mictv telugu

నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఊపిరాకడ ఉక్కిరిబిక్కిరి

May 11, 2020

ఏపీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి విషవాయువులు వెలువడి అమాయక ప్రజలు చనిపోయిన ఘటన గురించి మరిచిపోకముందే.. తాజాగా నెల్లూరులో మరో ఘటన చోటు చేసుకుంది. బళ్లారి-కృష్ణపట్నం జాతీయ రహదారికి సమీపంలో పెన్నానదికి ఆనుకుని ఉన్న  బాలాజీ కెమికల్స్ కంపెనీకి చెందిన గోడౌన్‌లో ఆదివారం రాత్రి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. రసాయనిక మిశ్రమాలతో తయారు చేసిన ఉత్పత్తులు కావడం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు. కరోనా సమయంలో ఏపీలో ఇలాంటి వరుస ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. రసాయనాల ఘాటు వాసనతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి ఉక్కిబిక్కిరి అయ్యారు. పరుగు పరుగున సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

ఈ ఘటన గురించి తెలుసుకున్న జల వనరుల శాఖామంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు అక్కడే ఉండి నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మరోవైపు జిల్లాకు చెందిన వాణిజ్య, పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. కాగా, ఆ ఫ్యాక్టరీలో తయారైన వస్తువులను ఇక్కడే నిల్వ ఉంచుతారు. బాలాజీ కెమికల్స్ ఫ్యాక్టరీలో తయారైన బ్లీచింగ్ పౌడర్, లిక్విడ్ హ్యాండ్ వాష్, లైమ్ పౌడర్, డిటర్జెంట్ పౌండర్ వంటి రసాయనిక ఉత్పత్తులను ఈ గోడౌన్‌లో నిల్వ ఉంచుతారు.