Firefighters return home after four years. Here are the full details
mictv telugu

అగ్నివీరులు నాలుగేళ్ల తర్వాత ఇంటికే.. పూర్తి వివరాలు ఇదిగో

June 21, 2022

కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకం కింద సోమవారం త్రివిధ దళాల్లో చేరేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పలు కీలక విషయాలను పేర్కొంది. సైన్యంలో చేరిన వారిని నాలుగేళ్ల తర్వాత విధుల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. కేవలం 25శాతం మందినే రెగ్యులర్ సర్వీసులోకి తీసుకుంటామని, ఈ నిర్ణయం పూర్తిగా తమ పరిధిలోని అంశమని, ఆ విషయంలో అగ్ని వీరులకు ఎలాంటి హక్కు ఉండదని నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

1. సంస్థాగత అవసరాలు, భవిష్యత్తులో ప్రకటించే విధానాల ఆధారంగా నాలుగేళ్ల సర్వీసు పరిమితిని పూర్తిచేసిన అగ్నివీరులకు భారత సైన్యంలో రెగ్యులర్ కేడర్‌కు దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని ఇస్తాం. ఈ దరఖాస్తులను సైన్యం కేంద్రీకృతంగా పరిశీలిస్తుంది. నాలుగేళ్ల విధి నిర్వహణలో అగ్నివీరుల పనితీరుతోపాటు, ఇతర కోణాల్లో వారి ప్రతిభను మదింపు చేస్తాం. ప్రతి బ్యాచ్‌లో 25% మందికి మించకుండా అగ్నివీరులను రెగ్యులర్ కేడర్‌లోకి తీసుకుంటాం.
2. ఇలా సాధారణ కేడర్‌లో చేరిన వారు ఉద్యోగ విధివిధానాలకు లోబడి, తదుపరి 15 ఏళ్ళ పనిచేయాల్సి ఉంటుంది. సాధారణ సర్వీసులకు తప్పనిసరిగా ఎంపిక చేయాలని కోరే హక్కు అగ్నివీరులకు ఉండదు. ఈ ఎంపిక పూర్తిగా సైన్యం పరిధిలోనే ఉంటుంది.
3. ‘అగ్నిపథ్’ పథకం కింద వైద్య విభాగం మినహా రెగ్యులర్ కేడర్‌లో సైనిక నియామకం అగ్నివీరులుగా నాలుగేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న వారి ద్వారానే జరుగుతుంది.
4. అగ్నివీరులకు ఎలాంటి పింఛన్, గ్రాట్యుటీ, మాజీ సైనికోద్యోగులకు వర్తింపజేసే కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం, క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ (సీఎస్ఎ) సౌకర్యం, మాజీ సైనికోద్యోగి హోదా, ఇతర ప్రయోజనాలు ఉండవు.
5. అగ్నివీరులు సర్వీసు కాలంలో తమకు తెలిసిన రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం పూర్తిగా నిషిద్ధం. వారు సైనిక ప్రయోజనాల దృష్ట్యా ఏ బాధ్యతలైనా నిర్వహించాల్సి ఉంటుంది. ఒక రెజిమెంట్‌లో నియమితులైన వారిని తర్వాత మరో రెజిమెంట్‌కు బదిలీ చేయొచ్చు.
6. ‘అగ్నిపథ్’ కింద చేరేవారికి భిన్నమైన ర్యాంకులు ఉంటాయి.

విద్య అర్హతలు ఇవే..

జనరల్ డ్యూటీ.. (సాధారణ విధుల) కోసం దరఖాస్తు చేసుకొనే అగ్నివీరుల వయసు 17.5 ఏళ్ల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతిలో 45% మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 33% మార్కులు రావాలి. ఏదైనా బోర్డు మార్కులు కాకుండా గ్రేడింగ్ విధానం పాటిస్తున్నట్లయితే అన్ని సబ్జెక్టుల్లో కనీసం ‘డి’ గ్రేడ్ (39% నుంచి 40%) సాధించాలి. మొత్తంమీద సె2 గ్రేడ్ (45%కి సమానం)తో పాసై ఉండాలి.

టెక్నికల్ పోస్టులకు.. దరఖాస్తు చేసుకొనేవారు 12వ తరగతి/ ఇంటర్మీడియట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాడ్స్, ఇంగ్లిష్ -సబ్జెక్టులతో 50% మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. ప్రతి సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా 40% మార్కులు వచ్చి ఉండాలి.

కర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్ (అన్ని విభాగాలు).. 12వ తరగతి/ ఇంటర్మీడియట్ లో ఏదో ఒక గ్రూప్ (ఆర్ట్స్, కామర్స్, సైన్స్) 60 % మార్కులతో, ఒక్కో సబ్జెక్ట్ లో కనీసం 50% మార్కులతో పాసై ఉండాలి. ఇంగ్లిష్, మ్యాథ్/ ఆకౌంట్స్/ ఖాతా పుస్తకాల నిర్వహణ (బుక్ కీపింగ్)లో 50% మార్కులు తప్పనిసరి.

అగ్నివీర్ ట్ర్మేన్ 10 పాస్ (అన్ని విభాగాలు).. 10వ తరగతి పాసై ఉంటే చాలు. ప్రతి సబ్జెక్ట్ లో 33% మార్కులు వచ్చి ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్మన్ (ఆల్ ఆర్ట్స్).. 8వ తరగతి సాధారణంగా పాసై ఉంటే చాలు. ప్రతి సబ్జెక్‌లో 33 మార్కులు వచ్చి ఉండాలి.