ఈశాన్య భారతంలో ఉద్రిక్తత.. కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం
అసోం - మేఘాలయ సరిహద్దుల్లోని ముఖ్రో ప్రాంతంలో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో మేఘాలయ వాసులు 5 గురు, అసోం ఫారెస్ట్ గార్డు ఒకరు ఉన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతంలో అక్రమంగా మేఘాలయకు వెళ్తున్న దుంగలను తరలిస్తున్న వాహనం అసోం అటవీశాఖ సిబ్బంది కంటపడింది. లారీని పట్టుకునేందుకు ప్రయత్నించగా, లారీ టైరును అధికారులు పంక్చర్ చేశారు.
డ్రైవర్ సహా మరో వ్యక్తిని పట్టుకోగా మిగతావారు పారిపోయారు. ఈ క్రమంలో అటవీ సిబ్బంది కాల్పులు జరపడంతో మేఘాలయకు చెందిన సరిహద్దు గ్రామాల ప్రజలు బారీ ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగ్గా అసోం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. ఆగ్రహించిన ప్రజలు ఎదురు దాడి చేసి అటవీ అధికారి ప్రాణాలు తీశారు. సున్నితమైన వ్యవహారం కావడంతో మేఘాలయలోని ఏడు జిల్లాల్లో రెండ్రోజుల పాటు ఇంటర్నెట్ నిలిపివేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. కాగా, అసోం నుంచి మేఘాలయ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. రెండు రాష్ట్రాల మధ్య 885 కిలోమీటర్ల మేర సరిహద్దు వివాదం ఉంది. 50 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ముగింపు పలుకుతూ మార్చి నెలలో ఇరు రాష్ట్రాల సీఎంలు ఒప్పందంపై సంతకాలు చేశారు. అయినా కొన్ని ప్రాంతాల్లో వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.