విష ప్రయోగం జరిగినప్పుడు ఏం చెయ్యాలి.. - MicTv.in - Telugu News
mictv telugu

విష ప్రయోగం జరిగినప్పుడు ఏం చెయ్యాలి..

July 11, 2019

శరీరంలో విషం ప్రవేశిస్తే అది రక్తంలో కలిసి ప్రాణాలు పోతాయి. సాధారణంగా విషం పాము కాటు వల్ల గానీ, ప్రమాదశాత్తు, మానసిక అస్వస్థతకు గురైనప్పుడు, ఆత్మహత్యా ప్రయత్నంలో గానీ, ఎవరైనా విషం తాగించినప్పుడు అది మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆరు మార్గాల ద్వారా విషం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. నోటి ద్వారా, ముక్కు నుండి పీల్చడం వల్ల, విష జంతువుల కాటు వల్ల, చర్మం ద్వారా, ఇంజెక్షన్ల వల్ల, కంటి ద్వారా విషం మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. నిద్రమాత్రలు, ఫినాయిల్‌, టాయిలెట్‌ క్లీనర్లు, పారసెటమాల్‌, పురుగు మందులు, ఆస్పిరిన్‌ మాత్రలు, మానసిక వ్యాధులకు వాడే మందులు, ఎలుకల మందు, గాజు ముక్కలు, ఉమ్మెత్త, గన్నేరు, కిరోసిన్‌, ఆసిడ్లతో విషం వాటిల్లుతుంది. ఆ సమయంలో అక్కడున్నవాళ్లు ప్రథమ చికిత్స ఎలా చేయాలో తెలుసుకుందాం.

 

First Aid Instructions

 

రోగి స్పృహ తప్పి పడిపోయిన వెంటనే శ్వాసనాళాన్ని సరిచేసి, శ్వాస, రక్త ప్రసరణలు చేయాలి. లేదంటే వెంటనే సిపిఆర్‌- కృత్రిమ శ్వాస కల్పించాలి. ఛాతినొక్కడం చేయాలి. 

 

నోటి ద్వారా విషప్రయోగం జరిగితే నోటిలో నోరుపెట్టి ఊదకూడదు. ఛాతి పక్కనుంచి నొక్కాలి. వెంటనే ఆసుపత్రికి తరలించాలి.

 

రోగి స్పృహలో ఉండి నిద్ర మాత్రలు, ఉమ్మెత్త, గన్నేరు, పురుగు మందులు, ఎలుకల మందు వంటి విషాలు తీసుకుంటే బూడిద లేని నల్లటి బొగ్గులను బాగా నూరి నీళ్లలో కలిపి తాగించాలి. లేదా సాధారణ కొళాయి  నీళ్లు బాగా తాగించాలి. అలా చేస్తే వాంతి అవుతుంది.

 

వాంతి చేయించిన తర్వాత ‘యూనివర్సల్‌ యాంటిడోట్‌’ ( అన్ని రకాల విషాలకు ఒకే విరుగుడు) రెండు భాగాలు కాల్చిన రొట్టె లేదా బ్రెడ్డు ఒక భాగం మిల్క్‌ ఆఫ్‌ మెగ్నీషియం, ఒక భాగం స్ట్రాంగ్‌ టీ కలిపి తాగించాలి.

 

రోగి తెలివిలో ఉంటే అతను ఏం విషం తీసుకున్నదీ, ఎంత తీసుకున్నది అడిగి తెలుసుకోవాలి.

 

రోగి పరిసర ప్రాంతంలో పడిఉన్న ఖాళీ సీసాలు, మాత్రలు, మాత్రల ఖాళీ ప్యాకింగ్‌లు, లేబిళ్లు సేకరించాలి.

 

కిరోసిన్‌, పెట్రోలు, ఆసిడ్లు వంటివి తాగితే అస్సలు వాంతి చేయించరాదు. అతనికి అరలీటరు పాలు తాగించాలి. నెయ్యి, గుడ్డులోని తెల్ల సోనా ఇవ్వాలి.

 

చర్మం ద్వారా విషం ప్రవేశించి ఉంటే ఆ భాగాన్ని నీళ్లతో బాగా కడగాలి. విషం అంటుకొన్న దుస్తులను తొలగించి బాగా స్నానం చేయించాలి.

 

ఘాటైన క్షారాలు తాగి ఉంటే నిమ్మరసం, మజ్జిగ, నీళ్లలో వెనిగార్‌ కలిపి ఇవ్వాలి.

 

కిరోసిన్‌ తాగితే లిక్విడ్‌ ఫారఫిన్‌ మందు 4 నుంచి 5 చెంచాలు తాగించాలి.

 

గాజు ముక్కలు మింగితే అరటిపండ్లు తినిపించాలి. అలా తినిపిస్తే అవి పేగులకు కోసుకోకుండా గాజు ముక్కలను ఉంగలా చుట్టుకుని విరేచనాల రూపంలో బయటకు వచ్చేస్తాయి.