దక్షిణాది తొలి మహిళా పీఠాధిపతి కన్నుమూత - MicTv.in - Telugu News
mictv telugu

దక్షిణాది తొలి మహిళా పీఠాధిపతి కన్నుమూత

March 15, 2019

దక్షిణ భారతంలో మొదటి మహిళా పీఠాధిపతి అయిన లింగాయత్ ధర్మ గురు, కర్ణాటకలోని కూడలసంగం బసవధర్మ పీఠాధిపతి.. మాతే మహాదేవి(73) మృతిచెందారు. యాదృచ్చికమో ఏమోగానీ నిన్ననే మాతే మహాదేవి పుట్టినరోజు జరిగింది. ఇవాళ ఆమె మరణించడం లింగాయత్‌లలో తీరని విషాదాన్ని నింపింది. గత కొంతకాలంగా ఆమె శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం కూడల సంగమం నుంచి బెంగుళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో ఇవాళ సాయంత్రం ఆమె కన్నుమూశారు.

First female Jagadguru of Lingayats Mathe Mahadevi passes away.

వీరశైవుల పవిత్ర క్షేత్రం కూడల సంగమం పీఠానికి ఆధ్యక్షురాలుగా వున్నారు. తన 20 ఏళ్ల వయసులోనే వీరశైవ ప్రచారంలో భాగంగా సన్యాసాన్ని స్వీకరించారు. వీరశైవ లింగాయత్ ధర్మ వ్యాప్తికి ఎంతో కృషిచేశారు. లింగాయత్ ప్రత్యేక ధర్మ ఉద్యమం ఉధృతం కావడంలో ఆమె పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. అభినవ అక్కమహాదేవి అని కూడా మాతే మహాదేవిని లింగాయత్‌లు పిలుస్తారు. కర్ణాటకలోని వీరశైవ లింగాయత్ పీఠాల్లో కూడల సంగమ పీఠానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ పీఠాన్ని బసవేశ్వరుడు ప్రారంభించారు. మూడు నదుల సంగమమైన ఈ క్షేత్రంలోనే బసవేశ్వరుడు జల సమాధి అయ్యారు.