పాక్ వాయుసేనలో తొలిసారిగా హిందూ పైలట్..
దాయాది దేశం పాకిస్తాన్‌లో మైనార్టీ వర్గానికి చెందిన హిందూ వ్యక్తికి అరుదైన అవకాశం దక్కింది. ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ హిందూ వ్యక్తి వైమానిక దళంలో చేరాడు. రాహుల్‌దేవ్ అనే వ్యక్తి పైలట్‌గా ఎంపికయ్యాడు. ఆయన పాకిస్తాన్ వైమానిక దళంలో జనరల్ డ్యూటీ పైలట్ పదవిని చేపట్టనున్నారు. దీనిపై ఆ దేశ హిందువులు హర్షం వ్యక్తం చేశారు. తమ వర్గం నుంచి తొలిసారి వైమానిక దళంలో పైలెట్‌గా చేరడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ దేవ్ సొంత ప్రాంతం హిందువులు అత్యధికంగా ఉండే సింధ్ రాష్ట్రంలోని థార్‌పర్కర్ జిల్లాకు చెందిన వాడు. ఈయన ఇటీవల జరిగిన సెలక్షన్స్‌లో వైమానిక దళంలోకి ఎంపికయ్యాడు. కాగా ఇప్పటికే మైనార్టీ వర్గానికి చెందిన హిందువులు ప్రభుత్వ ఉద్యోగులుగా, పాక్ సైన్యంలో పని చేస్తున్నారు. కానీ తొలిసారి హిందూ వ్యక్తి వైమానిక దళంలో ఉద్యోగం సంపాధించడం మాత్రం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. థార్‌పర్కర్ జిల్లాలో మౌళిక వసతులు, విద్యా,ఆరోగ్యం లాంటి సదుపాయాలు చాలా తక్కువ అలాంటి ప్రాంతం నుంచి ఇంతటి ఘనత సాధించడంపై సోషల్ మీడియాలో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.