రామ మందిర విరాళాలకు బ్యాంకు అకౌంట్! - MicTv.in - Telugu News
mictv telugu

రామ మందిర విరాళాలకు బ్యాంకు అకౌంట్!

February 19, 2020

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మించనున్న రామమందిరంపై కసరత్తు మొదలైంది. ఇటీవల  రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ పార్లమెంట్‌లో వెల్లడించిన సంగతి తెల్సిందే. ‘రామజన్మభూమి తీర్థ క్షేత్ర’ పేరుతో ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. మందిర నిర్మాణం కోసం 67.703 ఎకరాల భూమిని కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు..ఈరోజు తొలిసారి భేటీ అవుతోంది. ప్రజల నుంచి విరాళాల సేకరణ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. 

ఢిల్లీలోని పరాశరన్ నివాసంలో సాయంత్రం 5గంటలకు ట్రస్టు సభ్యులు సమావేశమవుతారు. రామ జన్మభూమి న్యాస్ అధిపతి మహంత్ నృత్యగోపాల్ దాస్‌ను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయోధ్య రామాలయ నిర్మాణ పనులన్నీ ట్రస్టు ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. ఆలయ నిర్మాణానికి విరాళాలను స్వీకరించేందుకు ట్రస్ట్ పేరుతో ఒక బ్యాంక్ అకౌంట్‌ను ప్రారంభించనున్నారు. ట్రస్ట్‌లో నామినేటెడ్ సభ్యుల ఎంపికతో పాటు కీలక నిర్ణయాలను ఈ మీటింగ్‌లో తీసుకోనున్నారు.