కరోనా వ్యాధి నివారణకు తొలి నాజల్ వ్యాక్సీన్ ఈ రోజు అధికారికంగా విడుదలైంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, శాస్త్రసాం కేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అధికారికంగా విడుదల చేశారు.
భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసి ఈ వ్యాక్సీన్ పేరు ఇన్‌కొవాక్ (iNCOVACC). ఇది కరోనాకు ప్రపంచంలోనే తొలి నాజన్ టీకా. భారత్ బయోటెక్, వాషింగ్టన్ యూనివర్సిటీ- సెయింట్ లూయీస్ సాయంతో దీన్ని తయారు చేసింది. 18 ఏళ్లు దాటిన వారికి దీన్ని రెండు బేసిక్ డోసులుగా, బూస్టర్ డోసుగా వాడాలి. ప్రైవేటు ఆస్పత్రులకు ఒక్కో డోసు ధర రూ. 800. దీనికి పన్నులు అదనం. ప్రభుత్వాలకు దీన్ని రూ. 325కు అమ్ముతారు. జీఎస్టీ అదనం. రెండు డోసులను 28 రోజుల తేడాతో తీసుకోవాల్సి వుంటుంది. ఇన్‌కొవాక్ ఇప్పటికే కొవిన్ పోర్టల్లో అందుబాటులోకి వచ్చేసింది. వచ్చే వారం నుంచి బహిరంగ మార్కెట్లోకి రానుంది. దీని విడుదల కార్యక్రమంలో భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, సంస్థ జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లా పాల్గొన్నారు.