ఆహని మాస్ కి రీచ్ చేసిన ఘనత నందమూరి బాలకృష్ణదే. అల్లు అరవింద్ ఎన్ని డబ్బులు పెట్టినా.. అల్లు అర్జున్ ఎంత ప్రమోట్ చేసినా రాని క్రేజ్ అన్‌స్టాపబుల్ విత్ NBK షోతో వచ్చేసింది. సహజంగా ఓటీటీ అంటే యూత్, క్లాస్ కే పరిమితం. కానీ బాలకృష్ణ పుణ్యమాని ఆహ పేరు నలువైపులా వ్యాపించింది. ప్రతి ఎపిసోడ్ దేనికదే స్పెషల్. బాలయ్య హోస్టింగ్ కి ఫిదా అవ్వని ఆడియన్ ఉండడేమో. గెస్టులతో చనువుగా, ఫన్నీగా బాలయ్య ప్రవర్తించే తీరుకి ప్రేక్షకులు కనెక్ట్ అయిపోవటంతో అన్‌స్టాపబుల్ విత్ NBK షో సూపర్ సక్సెస్ అయ్యింది. మహేష్ బాబు, చంద్రబాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి మేటి సెలబ్రెటీల ఎపిసోడ్స్ అన్ని ఆహాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది. అయితే తొలిసారి బాలయ్య షోపై నెగిటీవ్ ట్రోల్స్ వస్తున్నాయి. దేశంలోనే అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 1 నంబర్ వన్ ర్యాంక్ సాధించింది. అదే ఊపులో సీజన్ 2 కూడా దూసుకెళ్తుండగా.. తాజాగా ట్రిపుల్ ధమాకాను ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సారి ట్రిపుల్ ధమాకాలో సీనియర్ స్టార్ హీరోయిన్స్ జయసుధ, జయప్రదలు కనిపించబోతుండగా వీరితో పాటు యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా సందడి చేయబోతుంది.
ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించటమే కాకుండా త్వరలోనే ప్రోమోను విడుదల చేస్తామని తెలియజేసింది. ఇక సీనియర్ స్టార్ హీరోయిన్స్ జయసుధ, జయప్రదలు అన్‌స్టాపబుల్ షో సెట్స్ లో తాజాగా సందడి చేశారు. అన్న ఎన్టీఆర్ తో ఆడిపాడిన ఈ హీరోయిన్స్ తో బాలకృష్ణ సైతం స్టెప్పులేశాడు. అయితే ఈ ఇద్దరి మధ్య హీరోయిన్ రాశీ ఖన్నా కూడా పాల్గొంది. ఎన్టీఆర్‌తో ఆడిపాడిన సీనియర్ నటీమణులు జయసుధ, జయప్రదలతో బాలకృష్ణ ఇంటర్వ్యూ వరకు బాగానే ఉన్నా.. మధ్యలో రాశీఖన్నాను ఎందుకు యాడ్ చేశారనేది ప్రేక్షకులకు అర్థం కాలేదు. ఇదే విషయాన్ని నెటిజన్స్ ఆహా నిర్వాహకులను కామెంట్స్ రూపంలో ప్రశ్నిస్తున్నారు. అసలు మధ్యలో రాశీ ఖన్నా ఎందుకు? ఆమెకు మిగలిన ఇద్దరు సీనియర్ నటీమణులకు సంబంధమేంటి? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వీడియోలు, మీమ్స్ రూపంలో ట్రోల్ చేయటం కొస మెరుపు. ఇక “గాడ్ ఆఫ్ మాస్” నందమూరి బాలకృష్ణ ప్రభాస్ తో చేసిన బాహుబలి ఎపిసోడ్‌ను డిసెంబర్ 30న ప్రసారం చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే.