First Vande Bharat train to Telugu states
mictv telugu

హైదరాబాద్-విజయవాడకు ఇక 4 గంటలే..

November 15, 2022

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వందే భారత్ రైలు’ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇక పరుగులు పెట్టనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ను కలుపుతూ మరి కొద్ది రోజుల్లో ఈ హైస్పీడ్ రైలు ప్రారంభం కానుంది. వందే భారత్ రైలును నడపడానికి భారతీయ రైల్వే రెండు రూట్లను పరిశీలించగా.. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వందే భారత్ రైలు నడిపేందుకు టెక్నికల్ క్లియరెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

అలా ఐతే తెలుగు రాష్ట్రాల రాజధానుల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. అదే వందే భారత్ రైలు వస్తే కేవలం నాలుగు గంటల్లోనే విజయవాడకు చేరుకోవచ్చని అంచనావేస్తున్నారు. ఇదే రైలును తిరుపతి వరకు పొడిగించే అవకాశం ఉంది. ఇక భారతీయ రైల్వే వందే భారత్ రైలును నడిపేందుకు మరో రూట్‌ను కూడా పరిశీలిస్తోంది. వైజాగ్ నుంచి వందే భారత్ రైలు సికింద్రాబాద్ రూట్‌లో కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నూతన సంవత్సరం కానుకగా వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇటీవల దక్షిణాదికి తొలి వందే భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 11న మైసూర్-చెన్నై రూట్‌లో ఐదో వందే భారత్ రైలును ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మైసూర్ నుంచి బెంగళూరు మీదుగా చెన్నైకి ప్రయాణిస్తుంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకెళ్తుంది.