First woman solo cyclist to creating awareness about organ donation
mictv telugu

మొదటి మహిళ సైక్లిస్ట్ రికార్డ్!

November 23, 2022

First woman solo cyclist to creating awareness about organ donation

వయస్సు కేవలం ఒక సంఖ్య అని మరోసారి రుజువు చేస్తూ.. 45 ఏళ్ల ఇద్దరు పిల్లల తల్లి భారతదేశంలో పశ్చిమం నుండి తూర్పు వరకు ప్రయాణించిన మొదటి మహిళా సోలో సైక్లిస్ట్‌గా నిలిచింది. ఈ ప్రయాణంలో అవయవదానం పై అవగాహన కల్పిస్తున్నది.

గుజరాత్ సరిహద్దుల నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు దాదాపు 4,000 కిలోమీటర్ల దూరం సైకిల్ తొక్కిన ప్రీతి మాస్కే తన ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. అయినప్పటికీ.. ఇవేవీ ఆమె ప్రయత్నాన్ని ఆపలేదు. 14 రోజులలో.. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో సైకిల్‌పై ఒక్కతే ప్రయాణించింది. ఇది గిన్నీస్ లోకి ఎక్కించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇలాంటి ఫీట్ ఎవరూ చేయలేదు.

పూణేకు చెందిన ప్రీతి మాస్కే వయస్సు సంబంధిత అనారోగ్యం, డిప్రెషన్‌తో పోరాడుతున్నది. వీటి నుండి బయటపడేందుకు ఐదు సంవత్సరాల నుంచి సైక్లింగ్ చేయడం అలవాటు చేసుకున్నది. ఆమె RebirthThrust.org సంస్థ తరపున అవయవ దానం గురించి అవగాహన కల్పిస్తూ పశ్చిమం నుండి తూర్పు భారతదేశానికి సైకిల్ తొక్కింది. ది ప్రింట్ నివేదిక ప్రకారం.. ఆమె సగటున 19 గంటల శాడిల్ సైక్లింగ్ సమయంతో మొదటి పది రోజుల్లో దాదాపు 350 కి.మీ సైకిల్ తొక్కింది. ప్రతి రోజు నిరంతరంగా సైకిల్ తొక్కుతూనే ఉండడంతో ఆమె నిద్ర లేమి సమస్య పెరిగింది. ‘నేను 19 గంటలు నిరంతరంగా సైకిల్ తొక్కాను. కొన్నిసార్లు 24 గంటలకు పైగా సైకిల్ తొక్కాను. ఈ సమయంలో కాఫీ నన్ను మేల్కొల్పింది’ అని ఆమె చెప్పింది. ఆమె అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ మార్గంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఈ ప్రయాణం 15,679 మీటర్ల ఎత్తును కలిగి ఉంది. ఆమెను అనుసరించి వచ్చిన ఐదుమంది సిబ్బంది కూడా ఈ ప్రయాణాన్ని అపేయమన్నారు.

కానీ ఆమె మసాజ్, కొన్ని వ్యాయామాలు చేసి మళ్లీ సైక్లింగ్ మొదలుపెట్టింది. అలా అన్ని సమస్యలనూ అధిగమించి ఆమె 3,995 కి.మీలు అరుణాచల్ ప్రదేశ్‌లోని చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న కిబితుకు 13 రోజుల, 19 గంటల 12 నిమిషాల్లో చేరుకుంది. దీంతో.. ఆమె 14 రోజుల కంటే తక్కువ వ్యవధిలో పశ్చిమం నుండి తూర్పుకు దేశవ్యాప్తంగా ప్రయాణించిన మొట్టమొదటి మహిళా సోలో సైక్లిస్ట్‌గా నిలిచింది. ఈ ప్రయాణం గిన్నీస్ బుక్కి కూడా పంపించారు. అధికారింగా ఈమె ఇప్పటివరకు రికార్డుల్లోకి అయితే ఎక్కలేదు. కానీ ఆమె చేసిన సాహసాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే!