చేపల లారీ బోల్తా.. క్షణాల్లో లోడు మాయం - MicTv.in - Telugu News
mictv telugu

చేపల లారీ బోల్తా.. క్షణాల్లో లోడు మాయం

June 7, 2022

రహదారులపై లారీలు బోల్తా పడితే సమీప గ్రామాల్లోని ప్రజలకు పెద్ద పండగే. గాయపడిన వారి కంటే లారీలోని వస్తువుల కోసం భారీగా రోడ్డుపైకీ చేరుకుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలను మనం చూసే ఉంటాం.. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్‌ రోడ్డు వద్ద చేపల లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బోల్తా పడిన లారీ వద్ద చేపల కోసం స్థానికులు ఎగబడ్డారు. ట్రాఫిక్‌ జామ్‌ అవుతుందని పోలీసులు వారించినా..వాళ్లు ఏమాత్రం పట్టించుకోలేదు. 2 కేజీల బరువుండే సుమారు 4వేల చేపలు ఉన్న లారీ లోడ్‌ను అరగంటలో ఖాళీ చేశారు. ఏపీ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు వెళుతుండగా లారీ ప్రమాదానికి గురైంది.